ఘనంగా గీతా జయంతి వేడుకలు
రాజంపేట, పట్టణానికి చెందిన శ్రీ భగవాన్ గీతా సేవా సత్సంగ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్సంగ్ కమిటీ 35వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి, కార్యాధ్యక్షులు తుంగ వెంకటరమణారెడ్డి, కార్యదర్శి బొట్టా రామచంద్రయ్యనాయుడుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మునికి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు.
గీతా జయంతిని పురస్కరించుకుని స్థానిక సరస్వతీ విద్యా మందిరంలో రాజంపేట మండల పరిధిలోని విద్యార్థినీ విద్యార్థులకు సత్సంగ కమిటీ సభ్యులు వై.నందకిషోర్ గౌడ్, యూపీ రాయుడు, చీనేపల్లి చంగయ్య, అరవ రమణయ్య, పలుకూరి వెంకటరమణ తదితరులు భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ, శివ అంతర్యాగి తదితరులు గీతా జయంతి ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ సత్సంగ సభ్యులు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. భగవద్గీత నాల్గవ అధ్యాయం జ్ఞాన యోగము నుండి నిర్వహించిన కంఠస్థ పఠన పోటీలలో వివిధ పాఠశాలల నుండి సుమారు నూరు మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఒకటి నుంచి ఐదు తరగతుల విభాగంలో కుషాల్ (శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్), యోషిత (అక్షర హై స్కూల్ ), షేక్ సన (బి.ఎస్.సి హై స్కూల్), 6 7 8 తరగతుల విభాగంలో భవిత్ సాయి ( శ్రీ రీజెన్సీ నలంద హై స్కూల్), పుష్పలత (ఎం.పీ.యుపి స్కూల్ కొండ్లోపల్లి), షహనాజ్ (విజయభారతి యు.పి స్కూల్) లు , 9 10 తరగతుల విభాగంలో తేజేష్ ( శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్), సుదీప్తి ( శ్రీ రీజెన్సీనలంద హై స్కూల్), సాత్విక (శ్రీ రీజెన్సీ నలంద హై స్కూల్), వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. వీరికి సత్సంగ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు విలువైన పుస్తకాలు, జ్ఞాపికలతో, సర్టిఫికెట్ లతో సత్కరించారు.
న్యాయ నిర్ణయతలుగా గంగనపల్లి వెంకటరమణ, సువర్ణ జ్యోతిర్మయి, లక్ష్మీపతి, స్రవంతి, రామయ్య, నాగార్జున, బి.వి నారాయణరాజు, విజయ్, హనుమంతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సత్సంగ కమిటీ బాధ్యులు బొమ్మ రామ సుబ్బమ్మ, నాగ వేణుగోపాల్ రెడ్డి, బద్వేల్ సుబ్బరాయుడు, పూల సుబ్బయ్య, రాజా మదన్మోహన్ రెడ్డి, పోతుగుంట నాగేశ్వరరావు, రావూరి గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments