శ్రీ సాయి నారాయణ విద్యార్థినికి స్వర్ణ పతకం
రాజంపేట
సాయి నగర్ లో గల శ్రీ సాయి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న వర్ల జాహ్నవి ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సౌత్ జోన్ జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సాధించడం అభినందనీయమని పాఠశాల కరస్పాండెంట్ నీలి ఈశ్వరయ్య తెలియజేశారు. తమ పాఠశాల విద్యార్థిని జాహ్నవి స్వర్ణ పథకం సాధించిన సందర్భంగా బుధవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముందుగా క్రీడాకారిని జాహ్నవి తల్లిదండ్రులు వర్ల రాజేశ్వరి, నరసింహులు ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం జాహ్నవికి ట్రోఫీతో పాటు జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. క్రీడాకారిణికి శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ సునీల్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని తెలిపారు. క్రీడల వలన శారీరక దారుఢ్యం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం తో పాటు మానసిక వికాసం కూడా లభిస్తుందని.. తద్వారా చదువులో కూడా రాణించగలుగుతారని తెలియజేశారు. నేటి సమాజంలో విద్యార్థినీలు మార్షల్ ఆర్ట్స్ వంటి ఆత్మ రక్షణ విద్యలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని తెలిపారు. జాహ్నవి ని మిగిలిన విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివ శ్రీనివాస్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments