top of page
Writer's picturePRASANNA ANDHRA

లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు మేలు

జీతభత్యాల్లో వ్యత్యాసాలు, ఉద్యోగుల్లో భేదభావాలు తలెత్తకుండా ప్రొబేషనరీ ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటివరకు 60 వేల మంది ఉత్తీర్ణత జాబితాలో ఉన్నారని, జూన్‌ నాటికి మిగతా వారు పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు, ఆ వెంటనే ఇతర లాంఛన ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేశామని, జూలైలో కన్ఫర్మేషన్‌ ఇచ్చి కొందరికే కాకుండా అందరికీ కొత్త పే స్కేల్‌ వర్తింపు, ఆది నుంచీ సచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా దుష్ట శక్తుల దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు, వైఎస్‌ జగన్‌ సీఎం అయిన నాలుగు నెలలకే 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, నాడు నిరుద్యోగ యువతలో అపోహలు కల్పించిన తెలుగుదేశం పార్టీ నేతలు

ఏడాదిన్నర క్రితం వలంటీర్లనూ రెచ్చగొట్టి అపోహలు సృటించారని, తల్లి గర్భంలో పురుడు పోసుకునే పిండం ఈ లోకంలోకి రావాలంటే నవమాసాలూ నిండాల్సిందే!! అమ్మకు ప్రసవ వేదన, బిడ్డకు ఆరాటం తప్పవు, ఆదుర్దా ఎంత ఉన్నా, కాల పరీక్షలో నెగ్గాల్సిందే!! పక్వానికి వచ్చిన కాయను ముందుగానే కోసేస్తే..? చేదు అనుభవాన్ని చవిచూడక తప్పదు అని అన్నారు.


సచివాలయ ఉద్యోగుల 25 నెలల నిరీక్షణ మరి కొద్ది నెలల్లోనే ఫలించనుంది... చెప్పాలంటే నిండా ఐదు నెలలు కూడా లేవు.1.14 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ప్రొబేషన్‌లో ఉత్తీర్ణత సాధించారు. మిగతావారికీ జూన్‌ కల్లా పూర్తి కానుంది.. ఇంతలోనే హైరానా ఎందుకు మరి? ఒకేసారి చేరిన ఉద్యోగుల్లో అంతరాలను సృష్టించడం సబబేనా? కొంతమందికే కొత్త పే స్కేల్‌ వర్తింప చేయడం ఏం ధర్మం?.. బంతి భోజనంలో కొందరికి మాత్రమే వడ్డించి మిగతావారు ఆకలి కళ్లతో చూస్తుంటే బాగుంటుందా? ప్రభుత్వ ఉద్యోగికి ప్రొబేషన్, అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.. ఐఏఎస్‌లైనా ఇందుకు మినహాయింపు కాదు.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని చట్టం కూడా అనుమతించదు. రెచ్చగొట్టే వారి మాయలో పడిపోయి చిక్కుల్లో ఇరుక్కుంటే ఎవరు బాధ్యులు? సచివాలయాల వ్యవస్థ.. ముఖ్యమంత్రి మానస పుత్రిక. ఉద్యోగుల ప్రొబేషన్‌పై అధికారులకు ఆయన డెడ్‌లైన్‌ విధించారు. ఇందుకు విరుద్ధంగా వెళ్లే అవకాశమే లేదు.. అలాంటప్పుడు మరి కొద్ది నెలల్లో ముగిసే ప్రక్రియకు ఆదుర్దా ఎందుకు అన్నారు.


అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు స్థాయిలో ఒకేసారి కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యంతోపాటు పరిపాలనను పల్లె ముంగిటికే తెచ్చారు. ఉద్యోగుల్లో భేద భావాలు తలెత్తకుండా అందరి మేలును కాంక్షిస్తూ, ఒకేసారి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రొబేషనరీపై నిర్ణయం తీసుకున్నారు. కొందరిలో మాత్రమే సంతోషాన్ని నింపి మిగతావారిని నిరాశకు గురి చేయకుండా ఒకేసారి విధుల్లో చేరిన వారంతా సంతృప్తి చెందాలనే ప్రభుత్వం భావిస్తోంది.


ఒకరిద్దరికి మాత్రమే కాకుండా..

ఒకే సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరిద్దరు మాత్రమే కొత్త పే స్కేల్‌ ప్రకారం జీతాలు తీసుకుంటూ మిగతా నలుగురు ప్రొబేషనరీ పూర్తి కాక మనోవ్యధకు గురి కారాదనే జూన్‌కల్లా అందరికీ ప్రొబేషనరీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రొబేషన్‌ తరువాత వెంటనే ఇతర ఫార్మాలిటీస్, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి కొత్త పే స్కేల్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే కొన్ని శక్తులు సచివాలయాల ఉద్యోగులను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.


ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరి..

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి 1.34 లక్షల ఉద్యోగాలను కల్పించింది. విద్యుత్‌ అసిస్టెంట్‌ ఉద్యోగులు కాకుండా 1,14,092 మంది సచివాలయాల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు 60,385 మంది ఉద్యోగ ప్రావీణ్యతపై శాఖాపరంగా నిర్వహించే అంతర్గత (డిపార్ట్‌మెంట్‌) పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఏఎస్‌ అధికారులు మొదలు ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగి వరకు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే విధానం ఉంది. 2019లో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ ప్రకారమే సచివాలయాల ఉద్యోగులు అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు వారిపై గతంలో ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవంటూ పోలీసుల ద్వారా ఆయా శాఖలు అంతర్గతంగా తెప్పించుకునే యాంటిసిడెంట్‌ నివేదిక కీలకం.


మిగిలిన వారూ అర్హత సాధించేలా..

కుగ్రామాల్లో నివసించే ప్రజలు సైతం సొంతూరి దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దేశంలోనే వినూత్నంగా సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో సచివాలయాల భవనాల నిర్మాణాలను చేపడుతున్నారు. తన మానస పుత్రిక లాంటి సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరూ ఒకేసారి ప్రొబేషనరీకి అర్హత జూన్‌ కల్లా సాధించేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 14 వేల మందికి పైగా ఉన్న మహిళా పోలీసులకు డిపార్ట్‌మెంట్‌ పరంగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మిగిలిన కేటగిరీలోనూ గతంలో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాయని వారు, రాసినా ఉత్తీర్ణులు కానివారికి మరో విడత నిర్వహించేందుకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రక్రియ జూన్‌ కల్లా పూర్తై మరింత ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం ఉందని వెల్లడించారు.

మళ్లీ ఆ శక్తుల పనే!?

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును ఆదినుంచి వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ప్రొబేషనరీని బూచిగా చూపిస్తూ రెచ్చగొడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం వలంటీర్లను కూడా గౌరవ వేతనాలపై రెచ్చగొట్టిన ఉదంతాన్ని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు విపక్ష టీడీపీ నిరుద్యోగ యువతలో అపోహలు రేకెత్తించేలా దుష్ప్రచారానికి దిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో 19.20 లక్షల మంది నిరుద్యోగులు అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు తావు లేకుండా ఇంటర్వ్యూలు కాకుండా రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామక ప్రక్రియ చేపట్టినప్పుడు కూడా టీడీపీ తప్పుడు ప్రచారానికి పాల్పడింది. ఇప్పుడు కూడా అదృశ్య శక్తులు సచివాలయ ఉద్యోగులను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై క్షుణ్నంగా విచారణ జరపాలని కొందరు అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.

13 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page