ప్రశ్నించే గొంతులకే పట్టం కడదాం
ఉధ్యమ అభ్యర్థులను గెలిపించుకొందాం-
-ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, పెన్షనర్ల సంఘాలు
రాజంపేట, ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై అవగాహన కలిగి, వాటి పరిష్కారం కోసం అనునిత్యం పాటు పడుతున్న ఉద్యమ నేతలు కత్తి నరసింహా రెడ్డి, పోతుల నాగరాజులను పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎం.ఎల్.సి లుగా గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎస్.టి.యు, యుటిఎఫ్ నాయకులు సుబ్రమణ్యం రాజు, జగన్ మోహన్ రెడ్డి, హరి ప్రసాద్, జాబిర్ లు పేర్కొన్నారు.
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల పరిచయ సభ ఆదివారం రాజంపేటలోని జిల్లా పరిషత్తు ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్.టి. యు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఫ్యాప్టా ఛైర్మన్ గా జెఎసి కో-చైర్మన్ గా పనిచేసిన విశేష అనుభవంతో పాటు, విద్యారంగంలోనే తన జీవితాన్ని గడుపుతున్న కత్తి నరసింహారెడ్డిని మరోమారు ఆదరించాలన్నారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు, పలు రకాల ఉపాధ్యాయ ఉద్యమాలలో పాల్గొంటున్న పోతుల నాగరాజు "ను గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సి గా గెలిపించాలన్నారు. మేధావులు ఉండాల్సిన శాసన మండలిలో రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ శక్తులకు అవకాశం ఇవ్వరాదన్నారు.
ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులైన కత్తి నరసింహా రెడ్డి, పోతుల నాగరాజులు మాట్లాడుతూ రాజీలేని పోరాటాలు చేసే ఉద్యమసంఘాల నుండి వచ్చిన తమను ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు ఆదరించాలని కోరారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతులను ఉండనీయకూడదన్న ప్రభుత్వ కుట్రలను ఉపాధ్యాయులు, మేధావులు గమనించా లన్నారు. శాసనమండలి లోపలా, బయటా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన పోరాడు తున్నామన్నారు.
ఓటు నమోదులో బోగస్ ఓట్లను నమోదు చేయించిన వారు ఇప్పటికే నైతికంగా ఓడినట్లన్నారు. బోగస్ ఓట్ల నమోదులో అనైతిక చర్యలకు పాల్పడిన వారి మీద రాష్ట్ర మరియు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటు నమోదు వివిధ కారణాలతో ఇంకా నమోదు చేయించుకోని వారు తప్పనిసరిగా ఫారం-19 మరియు ఫారం-18లు పూర్తిచేసి, సర్టిఫికెట్లు జతపరచి, ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. తప్పుడు ఓటర్లను నమోదు చేసే అధికారులపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నమోదు ప్రక్రియలో ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే ఎస్.టి.యు, యుటిఎఫ్ నాయకులను విద్యారంగ, నిరుద్యోగుల సమస్యలపై సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ టి యూ రాష్ట్ర కార్యదర్శులు కె.బాలగంగి రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, యూ టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు డి.చెంగల్ రాజు, క్రిష్ణా రెడ్డి , జిల్లా కార్యదర్శి పి.వెంకట సుబ్బయ్య, సీనియర్ నాయకులు ఎం.నాగేశ్వర్ గౌడ్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.ఎల్ నరసింహులు, ఏఐటియుసి నాయకులు టి.రాధాకృష్ణ, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహమ్మద్, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments