ఉద్యమ నాయకులను గెలిపించుకుందాం - మార్పుకు నాంది పలుకుదాం - పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట
ఉద్యమ నేపథ్యం కలిగిన నాయకులను గెలిపించుకుని రాష్ట్రంలో మార్పుకు నాంది పలుకుదామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, సిఐటియు, ఏఐటియుసి, వివిధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడుతూ అధికార పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్లలో సంఖ్యా బలం ఉన్నందున అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. పాఠశాలల విలీనం పేరుతో రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని తెలిపారు. చదువుకునేందుకు పిల్లలు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, దీనివలన అనేకమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు. అధికార పార్టీ ఉద్యోగులను ముప్పు తిప్పలు పెడుతోందని విమర్శించారు. నిరుద్యోగులు ఉద్యోగం మీద ఆశ వదులుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడంలో ప్రతిపక్షం విఫలమైందని, ప్రజల పక్షాన పోరాడకుండా సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతూ టిడిపి శిఖండి పాత్ర వహిస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేస్తే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వ శాఖను వినియోగించుకుని తపాలా ద్వారా వేయి రూపాయలు నగదు, కరపత్రాలనుపంపిణీ చేస్తూ బహిర్గతం అయిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. వామపక్ష భావాలు, కలిగి.. ఆరు సంవత్సరాలుగా శాసనమండలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పక్షాన పోరాడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థి దశ నుంచే పలు సమస్యల పైన పోరాటం చేస్తూ సమైఖ్యాంద్ర ఉద్యమంలో కటకటాల పాలై మరెన్నో వివిధ రకాల ఉద్యమాలలో నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తూ సేవే పరమావధిగా భావిస్తూ అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్న తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రకాల సుమారు 180 పైబడి సంఘాలను కలుపుకొని నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగ-ఉపాధ్యాయ హక్కులు, అధికారాలు, ఆత్మగౌరవం, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల టైం స్కేల్ కోసం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం, పెన్షనర్ల హక్కుల పరిరక్షణ, రాయలసీమ సమగ్ర అభివృద్ధి, వికలాంగుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డిని, తనను గెలిపించి మార్పుకు నాంది పలకాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
కరపత్రాలు పంపిణీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు వివిధ సంఘాల, పార్టీల నాయకులతో కలిసి ఆర్.ఎస్ రోడ్డులో గల శ్రీ చైతన్య పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డితో భేటీ అయి ప్రైవేటు ఉపాధ్యాయులతో చర్చించి కరపత్రాలు పంపిణీ చేశారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, సిపిఐ నాయకులు మహేష్, సికిందర్, శివ రామకృష్ణ దేవర, ఎం.ఎస్ రాయుడు, కాంగ్రెస్ నాయకులు పూల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Kommentarer