కొత్తపల్లి పంచాయతీలో గ్రామసభ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ప్రాంగణం నందు శుక్రవారం ఉదయం సెక్రెటరీ నరసింహులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సభకు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, డి ఎల్ డి ఓ సుబ్రహ్మణ్యం, పి ఆర్ జె ఈ కృష్ణ ప్రసాద్, పంచాయతీ పరిధిలోని సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13326 పంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, కొత్తపల్లి పంచాయతీ నందు ప్రజలకు కావలసిన మౌలిక వసతులు సదుపాయాల గురించి ముఖ్యంగా చర్చించామని, ఇందులో భాగంగా మునుపెన్నడు జరగని విధంగా గ్రామపంచాయతీల అభివృద్ధి జరగనున్నదని అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పౌర పరిజ్ఞాన సమాచారం అందించేందుకు ఈ గ్రామసభలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ పనులు, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, వ్యక్తిగత లబ్ధినిచ్చే పనుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, పారదర్శకత జవాబుదారీతనం విశ్వసనీయతకు ప్రతీకగా గ్రామసభలు నిర్వహించి స్వర్ణ గ్రామ పంచాయితీ అమలుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. గృహ అవసరాల కల్పనలో భాగంగా విద్యుత్, కులాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల సదుపాయం, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు పంచాయతీ పరిధిలోని గ్రామాలు అన్నింటికీ అందించాలన్నదే సదుద్దేశమని, సాధారణ సదుపాయాల మెరుగుదల లో భాగంగా నీటి సరఫరా పథకం, డ్రైనేజీ పథకం, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రోడ్లు, ఘన వ్యర్ధాల నిర్వహణ వంటి సేవలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. గ్రామాలకు పట్టణాలతో అనుసంధానం చేసే రోడ్లను మెరుగుపరిచి గ్రామాల నుండి పట్టణాలలోని మార్కెట్లకు వెళ్లేందుకు లింక్ రోడ్లు నిర్మించనున్నామని, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సుస్థిర గ్రామీణ జీవన పరిస్థితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి నీటి సంరక్షణ పనులు, పండ్ల తోటలు, మల్బరీ తోటలను అభివృద్ధిపరిచే విధంగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. అనంతరం ప్రజలు వారికి సమ గ్రామాలలో ఉన్న సమస్యలపై వినతిపత్రం అందించారు.
Comments