శ్రీరాముని బంటుకి.. బంటు ఈ రామచంద్రుడు.
---మూడు దశాబ్దాలుగా దేవుని సేవలో తరింపు.
--అనునిత్యం దేవాలయ అభివృద్ధికి కృషి.
--నేడు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి సంబరాలు.
అలనాడు శ్రీరామచంద్రుల వారికి నమ్మిన బంటుగా చరిత్రలో నిలిచిన శ్రీ ఆంజనేయ స్వామికి బంటుగా రామచంద్రయ్య చిట్వేలి మండల పరిధిలో నిలిచారు. తన సంపదను, తన జీవితాన్ని ఆంజనేయునికి ధారపోసి అనునిత్యం శ్రమిస్తూ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత తనది.
మనుషులు నిలిచేందుకు కూడా భయపడే చోటులో..సుమారు మూడు పదుల కాలం నుంచి దేవాలయ నిర్మాణానికి పూనుకొని సమీప మరియు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తదితరులు అందించిన సాయంతో నాడు దేవాలయాన్ని, కళ్యాణ మండపాన్ని, నవగ్రహాల మంటపం తదితర నిర్మాణాలను భక్తుల అవసరార్థం గొప్పగా నిర్మించారు.
ప్రతి ఏడాది హనుమాన్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఇక్కడ పరిపాటి. ఈ క్రమంలో భాగంగా ఈరోజు ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాల నడుమ దేదీప్యమానంగా అలంకరించారు. స్వామి వారి మూల విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకు పూజ, వడమాల, అర్చన తదితర సేవలతో భక్తులు స్వామివారిని సేవించారు. దక్కిలి వారిచే ఏర్పాటు చేయబడ్డ హరే రామ, అన్నమయ్య కీర్తనలు అందరినీ అలరించాయి. కాగా చిలకలూరిపేట వాస్తవ్యులచే ఈరోజు సాయంత్రం చింతామణి పౌరాణిక నాటకం ఏర్పాటు చేశామని ధర్మకర్త తెలిపారు.
ఉదయం, మధ్యాహ్నం ఏర్పాటు చేయబడ్డ అల్పాహార, భోజన కార్యక్రమానికి ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు,సమీప మరియు మండల పరిధిలోని గ్రామ ప్రజలు వేలాదిమంది పాల్గొన్నారు. నేను పడ్డ కష్టానికి నేడు ఇంతటి ప్రతిఫలం చేకూరడం సర్వదా నాకు ఆనందమని సహాయపడ్డ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, ఇంకనూ ఆలయ అభివృద్ధిలో మీ సహాయాన్ని కొనసాగించాలని భక్తులను ధర్మకర్త మాదినేని రామచంద్రయ్య స్వామి కోరారు. ఈరోజు జరిగిన కార్యక్రమాలలో సమీప రాజుకుంట, అనుంపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సేవలు అందించారని తాను తెలిపారు.
Comentarios