నేడు శ్రీ రామ నవమి సందర్భంగా
శ్రీ రామ భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!
శ్రీ సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు.
చైత్ర శుద్ధ నవమి ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో నుండగా పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో గురువారము నాడు లోక కళ్యాణార్థం, ఈ లోకములో ధర్మాన్ని నిలపటానికి ఆ పర బ్రహ్మమే కౌసల్య దశరథుల నోముల పంటగా " రాముడు" గా అవతరించాడు!!
ఆయన పుట్టిన రోజునాడు లోక కళ్యాణార్థం
"సీతారాముల" కళ్యాణం చేయటం ఆనవాయితిగా వస్తుంది!!
ఊరూ వాడ ఏకమై కన్నుల పండుగగా జరుపు కోవటం మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం!!
భద్రాచల భక్త రామదాసు దీనికి శ్రీకారము చుట్టి, భద్రాచలంలో బ్రహ్మాండంగా ఆరుబయట అందరూ వీక్షించాలని "సీతారాముల కళ్యాణం" గావించాడు!!
శ్రీరామనవమి శ్రీరామచంద్రుని పుట్టినరోజు కదా!
మరి సీతారాముల కళ్యాణం ఏ రోజున జరిగింది??
సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర
యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజు జనకపురిలో
జరిగింది!! మహతాం జన్మనక్షత్రే వివాహం అంటుంది ఆగమశాస్ర్రం! కావున చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో ఆయన జన్మతిథి రోజు
శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకునే సంప్రదాయం వచ్చింది!!
"రమణీయ కళ్యాణములో కమనీయ దృశ్యం"
మిథిలానగరం!
జనక మహారాజు భవనం దేదీప్యమానంగా
వెలిగిపోతోంది!
శివధనుస్సును శ్రీరాముడు విరిచేశాడంట! ఆయనే సీతమ్మను చేపట్టబోతున్నాడట!!
మన జానకి చందనపు బొమ్మ! మరి రాముడో
ఆయనేమి తక్కువకాదు!! ఆయన నీలమేఘ శ్యాముడు!! చాలా గొప్ప అందగాడట!! చంద్రుని కంటే అందంలో ఆహ్లాదం కలిగించే
రామచంద్కుడట!! అంతఃపురమంత అదేముచ్చట!! జనకపురిలో జనుల చర్చలు!! ఇద్దరికి మంచి తగినజోడును కుదిర్చాడు బ్రహ్మదేవుడు!!
అయోధ్యకు కబురు పంపించాడు జనకుడు!
అయోధ్యలో విషయం తెలుసుకున్న కౌసల్య
సుమిత్ర, కైకేయి, దశరథుల సంతోషానికి
పట్ట పగ్గాలు లేవు!! నిన్నటిదాకా మనచేతులలో
ఆడే రాముడు శివధనుస్సు ను విరచి
స్వయంవరంలో గెలిచైడట! సీతమ్మను చేపట్టబోతున్నాడట అని సంభరపడిపోతున్నారు!!
దశరథుడు తన పరివారంతో వశిష్ఠ,వామదేవ,
జాబాలి, కశ్యప, కాత్యాయన, మార్కండేయాది
మహార్షులతో జనకపురికి బయలు దేరాడు!!
జనకమహారాజు వారికి తగిన గౌరవమర్యాద
లతో స్వాగతం పలికి తగిన విడిది ఏర్పాటు
చేశాడు!!
మహర్షులు వెంట రాగా యజ్ఞశాలకు వచ్చాడు దశరథుడు!! రాముడు విజయ ముహూర్తాన మంగళాచారములన్నీ పూర్తి చేసి చక్కగా అలంకరించుకుని తమ్ములతో కలసి తండ్రి
వద్దకు వచ్చాడు!!
జనకుని ప్రార్థన పై విశ్వామిత్రశతానందులను వెంట పెట్టుకుని వసిష్ఠుడు కళ్యాణ మండపం వద్దకు అరుదెంచాడు!
ఆకాశమంత పందిరి!! భూదేవి అంత వేదిక వేశారు!! మండపము మధ్యన అగ్ని వేదికను
నిర్మించారు !! జనక మహారాజు సర్వమంగళ స్వరూపిణి సర్వాభరణ భూషిత యైన సీతమ్మను తీసుకుని వచ్చాడు!! ముత్తైదువలు సీతమ్మను రాముని ఎదుట కూర్చోపెట్టారు!!
మంగళ వాయిద్యాలు మారు మోగుతున్నాయి!
వేదమంత్రాలు శ్రావ్యంగా వినబడుతున్నాయి!!
సుగంధ పరిమళాలు గుభాళిస్తున్నాయి!!
పన్నీటి పలకరుంపులు హాయిగొలుపుతున్నాయి!!
సీతారాములను ఒక చోట చూసిన జనకపురి జనులు ఆనందపర వశులై జనకుని పుణ్య మంతా జానకియై పుట్టంది!! దశరథుని పుణ్యము శ్రీరాముడుగా పుట్టాడు !! చూసిన మన మెంత పుణ్యం చేసితిమి గదా!! ఈ సీతారామ కళ్యాణ వైభవమును తిలకించే భాగ్యం మనకు కలిగినది అని ముచ్చటించు కుంటున్నారు!! ముచ్చట పడుతున్నారు!!
జనకుడు ముందుకు వచ్చాడు అగ్ని సమక్షమున నిలబడి అగ్నిసాక్షిగా
"ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీ తవ! ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా! పతి వ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా "!
ఇదిగో నా పుత్రికయైన సీత ఈమె నీకు సహధర్మచారిణి ఈమెను స్వీకరించు నీ చేతితో ఈమె చేయి పట్టుకో మహా భాగ్యవంతురాలైన ఈమె పతి వ్రతయై నిన్ను సదా నీడ లాగ అనుసరిస్తుంది!! అని పలికి మంత్రపూత జలాన్ని రాముని చేతిలో విడిచాడు!! దేవతలు పుష్ప వృష్ఠిని వర్షించారు!!
దుందుభులు మ్రోగించారు !! మంగళవాయుధ్యాలు మిన్ను ముట్టగా ద్విజుల వేద మంత్రాల ఆశీర్వచనాల ఘోష సర్వ శుభకరంగా సర్వ జనులకు పరమానందాన్ని కలిగించింది!!
"మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాకంఠే బద్నామి శుభగే జీవంతు శరదాం శతమ్ "అంటూ శ్రీరాముడు సీతమ్మ మెడలో మూడు ముళ్ళు వేశాడు"!
ఒకరి పై ఒకరు ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు ఈ విషయంలో మాత్రం మా అమ్మ సీతమ్మదే పై చేయి అయింది!!
కళ్యాణ మంటపమున సీతమ్మ సర్వాలంకార భూషితయై శోభిస్తూవుంది అమ్మ మనసు అలజడిగా వుంది !! స్వామి వారిని ఎప్పుడు చూడాలా అని తల పోస్తూవుంది ఇది గ్రహించిన చెలికత్తెలు పుష్పమాలను తెచ్చి ఆమెకందించారు.
రామునికి వేయమని సైగ చేశారు సీతమ్మ పూలమాలను గ్రహించింది రెండు చేతులతో పట్టుకుంది పూలమాల వేయటంలో ఆలస్యం జరుగుతోంది!!
జనులు ఉత్కంఠ తో ఎదురు చూస్తూ వున్నారు!!
రాముడు పొడగరి సీతమ్మ పొట్టిగా వుంది!!
ఆయన తలవంచడు !!
ఈమెకు తల అందదు !!
వదిన సీతమ్మ సమస్యను గ్రహించిన లక్ష్మణ స్వామి ఈ సమస్యకు పరిష్కారము తన దగ్గర వున్నదని గురువు విశ్వామిత్రుల వారి అనుమతితో త్వర త్వరగా వెళ్ళి శ్రీరాముని పాదాలపై పడ్డాడు !!
వెంటనే రాముడు తల వంచి నాయనా!! లక్శ్మణా అంటూ తలనికిందికివంచాడు !! ఇంతలో సీతమ్మ తల్లి చటుక్కున పూలమాలను స్వామి మెడలో వేసింది!!
సర్వజనులు ఆనందముతో వుప్పొంగి పోయారు
సీతారాములు ఒకరి మెడలో ఒకరు పుష్పమాలలు వేసుకున్నారు !!
ఈ వేడుక ఎంతో కన్నుల పండుగగా జరిగింది!!
ఊరి ఊరిలో వాడ వాడ లో ఇప్పటికీ జరుగుతూనే వుంది!!
పవమాన సుతుడు బట్టు పాదారవిందములకు
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం!!నిత్య శుభ మంగళం!! శుభమ్ భూయాత్!!
ధర్మస్యవిజయోస్తు, అధర్మస్యనాశోస్తు, విశ్వస్యకళ్యాణమస్తు.
Comments