బోయినపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ, బైక్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి - తల వేరుపడి మొండాన్ని ఈడ్చుకెళ్లిన లారీ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించి కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని కోటి ఆశలతో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి కలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది.
సింహాద్రిపురం మండలం బిధినిచర్ల గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ బోయినపల్లి లోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం బోయనపల్లె లోని తన గది నుండి ఏ.పీ 21 సి.ఎఫ్ నంబరు గల యమహా బైక్ పై రాజంపేటకు వస్తుండగా కడప నుండి తిరుపతికి వెళుతున్న కె.ఏ 51 ఏ.హెచ్.6300 అనే నంబరు గల లారీ ఢీకొని బోయిన పల్లె వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంతో పాటు లారీ కింద పడిపోవడంతో తల మొండెం నుంచి వేరై మొండెం తో పాటు ద్విచక్ర వాహనాన్ని లారీ కొంత దూరంపాటు ఈడ్చుకెళ్లిన ఒళ్ళుగగుర్బొడిచే సన్నివేశాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురై నిశ్చేస్టులయ్యారు. విద్యార్థి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి ఇమాంబీ కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థిని ఇంజనీరింగ్ చదివిస్తోంది. ఒక్కగానొక్క బిడ్డ మరణ వార్త తెలిస్తే తన తల్లి ఏమైపోతుందోనని జరిగిన ఘటన పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ముందు భాగాన కర్ణాటక రాష్ట్రం యొక్క రిజిస్ట్రేషన్, వెనుక భాగాన హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు దర్శనమిస్తున్నాయి. జరిగిన ప్రమాదం పై రూరల్ పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments