top of page
Writer's pictureEDITOR

300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉంది : ఇస్రో చైర్మన్ సోమనాథ్

300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉంది : ఇస్రో చైర్మన్ సోమనాథ్


పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా జీవిత కాలాన్ని పెంచొచ్చన్న ఇస్రో చైర్మన్


జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు


ఒక్క విజయం సాధిస్తే తన ఫెయిల్యూర్స్‌ను ప్రపంచం మర్చిపోయిందన్న సోమనాథ్


54 మంది విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానం

మనిషి సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలు. ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 110 ఏళ్లు జీవించి రికార్డులకెక్కినవారూ ఉన్నారు. మరి ఏకంగా రెండుమూడు వందల సంవత్సరాలు జీవించే అవకాశం వస్తే.. అబ్బ! ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది. అయితే, ఆ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. శరీరంలో పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా 200, 300 సంవత్సరాలు జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో నిన్న జరిగిన 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడ? వస్తాయన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీలను కక్ష్యలోకి పంపుతున్నట్టు వివరించారు. మానవులను అంతరిక్షంలోకి పంపే ‘మిషన్ గగన్‌యాన్’ను ఈ ఏడాదిలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు రోబోటిక్ పరిజ్ఞానం పెంచుకుని అత్యాధునిక రోబోలు సృష్టిస్తే అంగారక, శుక్రగ్రహాలపై ఇస్రో చేపట్టే ప్రయోగాల్లో వినియోగించుకుంటామని చెప్పారు.

నేనూ ఫెయిలయ్యా

తాను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి అన్నీ విజయాలే సాధించానని అనుకోవద్దని, తాను కూడా ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిలయ్యానని సోమనాథ్ తెలిపారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎదురయ్యే అపజయాలే విజయానికి నిజమైన సోపానాలని పేర్కొన్నారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని, అంతకుముందు రెండుసార్లు ఫెయిల్ అయిన విషయాన్ని అందరూ మర్చిపోయారని గుర్తు చేశారు. రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో తాను కూడా తప్పులు చేశానని పేర్కొన్నారు.


ఈ స్నాతకోత్సవంలో 54 మంది విద్యార్థులకు సోమనాథ్ బంగారు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేర్, రెక్టార్ గోవర్ధన్, ఇతర ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ తమిళిసై వీడియో సందేశం పంపుతూ జేఎన్‌టీయూ దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా నిలిచిందని పేర్కొన్నారు.


46 views0 comments

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page