మూడు నెలల వ్యవధిలో పోలీసులు అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలి - ఎమ్మెల్యే రాచమల్లు
కడప జిల్లా, ప్రొద్దుటూరు
మూడు నెలల కాలవ్యవధిలో ప్రొద్దుటూరు పట్టణంలో ఎటువంటి అసంఘక కార్యకలాపాలకు చోటు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అందుకు పోలీసులే కారణమంటూ ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పోలీసులు తమ అధికారులకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని, గత సంవత్సరం రోజులుగా ప్రొద్దుటూరులో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రేరణకుమార్ ఐపీఎస్ ఎందుకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయలేదని, చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు? తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసాంఘిక కార్యకలాపాలు నియంత్రించకపోతే తాను పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తానని హెచ్చరిస్తూ జూదరహిత ప్రొద్దుటూరుగా నియోజకవర్గాన్ని చూడాలని ఉందని ఆకాంక్షించారు. టిడిపి హయాంలో అసాంఘిక కార్యకలాపాలు జరగలేదా? నాడు పోలీసులకు ఎందుకు అడ్డుకోలేదంటూ, ఎమ్మెల్యేగా తాను ఏనాడు అసాంఘిక కార్యక్రమాలను ప్రేరేపించి పెంచి పోషించలేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో తనకు వచ్చిన లాభాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగిస్తున్నానని, ఇది గిట్టని టిడిపి నాయకులు తమపై అసత్య ఆరోపణలు చేస్తూ, తనను ప్రజలలో చులకనగా చేసే ప్రయత్నాన్ని తాను తిప్పి కొడతానని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా తనను టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని, సాక్షాలు ఆధారాలతో విమర్శలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ స్థాయి అధికారి ఎవరైనా నేర ప్రవృత్తి కలవారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం సర్వసాధారణమని, ప్రొద్దుటూరులోనే కాక జిల్లా వ్యాప్తంగా నేర ప్రవృత్తి గల వారిని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారని, అయితే ఇందులో అధిక స్థాయిలో మట్కా, క్రికెట్ బుకీలు ప్రొద్దుటూరు కి చెందిన వారిని దీనిని టిడిపి నాయకులు భూతద్దంలో చూపించి ఏదో జరగబోతుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీరందరికీ తానే బాసని చెప్పటం మరి విడ్డూరమని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా టార్గెట్ చేస్తూ టిడిపి నాయకులు మాట్లాడటం సమంజసం కాదని, ఏనాడూ ప్రజల సమస్యలపై పోరాటం చేయని టిడిపి నాయకులు బాబు చేసిన ప్రయోజనాలను ప్రజలకు చూపి ఓటు అడిగే అర్హత లేదన్నారు. గత ప్రభుత్వాలలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం నిర్వహించలేదా అని ప్రశ్నిస్తూ, తమ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా నేడు క్రికెట్ బుకీ కాదు అని కితాబిచ్చారు. ప్రభుత్వాలు మారతాయి పోలీసులు కాదు అని, గత ప్రభుత్వాలలో పనిచేసిన పోలీసులే నేడు పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసి ఉంటే, నియోజకవర్గంలో తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉంటేనే తనకు ఓటు వేయమని అభ్యర్థిస్తానని, కానీ టిడిపి నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓటు అభ్యర్థిస్తారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ కాజా, ఎంపీపీ శేఖర్ యాదవ్, పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, సీనియర్ వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగ శేషారెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comentarios