బీజేపీతో జనసేన ''కటీఫ్'' కు ముహూర్తం ఖరారు? వేడెక్కనున్న ఏపీ రాజకీయం??
భారతీయ జనతాపార్టీతో మిత్రత్వం నెరపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన స్నేహబంధానికి ముగింపు పలకబోతున్నారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగినప్పుడు పొత్తులకు సిద్ధమేనని, వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని, కేంద్రం నుంచి రోడ్‌మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు.అయితే ఇంతవరకు కేంద్రం నుంచి ఎటువంటి రోడ్‌మ్యాప్ అందలేదు.కేంద్ర బీజేపీ పెద్దలు పవన్ కల్యాణ్‌కు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తుండటం ఆయన్ను మనస్తాపానికి గురిచేస్తోందని జనసేన నేతలు వెల్లడించారు.
బలమైన సామాజికవర్గం అండగా ఉన్నప్పటికీ..
బలమైన సామాజిక వర్గం అండగా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీని నడపాలంటే నిధుల కొరత ఎదురవడం సహజం.ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని 2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీకి స్నేహహస్తాన్ని అందించారు.అయితే వైసీపీని గద్దె దించాలనే తన లక్ష్యానికి రాష్ట్ర బీజేపీ నేతలు సహకరించక పోవడం,కొందరు నేతలు లోపాయికారీగా అధికార పార్టీకి సహకరిస్తున్నా రంటూ పవన్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తర్వాత బీజేపీ, జనసేన అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. దూరంపెరుగుతోందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కరోనావల్ల తమ మధ్య 'భౌతిక దూరం' పెరిగిందని,అది తగ్గగానే ఈ దూరం కూడా తగ్గిపోతుందని అన్నారు. ''కరోనా తగ్గేదిలేదు.. ఈ దూరం కూడా తగ్గేది లేదు'' అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన సభలకు ఆహ్వానం అందేలదు?
రాజమండ్రిలో ''గోదావరి గర్జన'' పేరుతో జరిగిన సభకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
దీనికి పవన్‌కు ఆహ్వానం అందలేదు.భీమవరంలో ప్రధానమంత్రి సభ జరిగింది.దీనికికూడా ఆహ్వానం అందలేదు. ఫోన్ చేసి చెప్పామని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇందులో వాస్తవమెంతో ఈ రెండు పార్టీల నేతలకే తెలియాలి.తన సినిమాల నుంచి అందే రెమ్యునరేషన్ నే పార్టీ ఖర్చులకు పవన్ వినియోగిస్తున్నారు. ఇతరత్రా ఎటువైపు నుంచి పార్టీకి నిధులు అందే అవకాశం లేదు. అయినప్పటికీ ఆయన పట్టుదలగా పార్టీని ప్రజాస్వామిక వాదులను మంత్రముగ్ధులను చేస్తోంది.
విజయదశమి రోజు సరికొత్తగా..
అక్టోబరు 5వ తేదీన విజయ దశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు పవన్ కల్యణ్ శ్రీకారం చుట్టబోతున్నారు. అదేరోజు బీజేపీతో తమ పార్టీకున్న మిత్రబంధాన్ని తెగతెంపులు చేసు కుంటారని వార్తలు వస్తున్నాయి.దీనిపై జనసేన వర్గాలు మౌనంగా ఉన్నాయి.బస్సు యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు వైసీపీవల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలిగిందనే విషయాన్ని కూడా ఆయన ప్రజలకు వివరించబోతున్నారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ అంటేనే మండిపడుతున్న అధికార పార్టీ నుంచి యాత్రకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments