నవ సమాజ నిర్మాణం కోసం భారీ ర్యాలీ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నవసమాజ నిర్మాణం కోసం జీవనజ్యోతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో, సంస్థకు చెందిన అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులచే బుధవారం ఉదయం 10 గంటలకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నుండి గాంధీ రోడ్డు, టిబి రోడ్డు, శివాలయం రోడ్డు మీదుగా పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జీవనజ్యోతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు డా. గురుదేవ్ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జీవనజ్యోతి విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లితండ్రులు, పలు కళాశాలల విద్యార్థులు వేలాది సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవనజ్యోతి విద్యాసంస్థల కరస్పాండెంట్ యత్తపు అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో యువకులు చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్నారంటూ, ఓ యువత మేలుకో... నాన్న తెలుసుకో... అమ్మా మలుచుకో... అనే నినాదంతో, చరవానీలు విషయపరిజ్ఞానం కొరకే ఉపయోగించాలని, చెడు అలవాట్లకు పోకడలకు ఉపయోగించవద్దు అంటూ, పిల్లలపై ఇంటి వద్ద తల్లిదండ్రులు పాఠశాల కళాశాలలో ఉపాధ్యాయులు ఒక కంట కనిపెట్టి ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటి పోయిందని, ఇకనైనా మేల్కొనకపోతే యువత జీవితాలతో పాటు భవిష్యత్ తరాలు కూడా అస్తవ్యస్తమవుతాయంటూ, నిర్లక్ష్యం వీడి యువత పట్ల ఆలోచించవలసిన పరిస్థితి ఉందని, భావితరాలకు భవిష్యత్తును నిర్మిద్దాం... రండి... కదలిరండి... అని కదం తొక్కారు.
Comments