నిరుద్యోగ యువతకు ఉపాధి చూపడమే జాబ్ మేళా లక్ష్యం - జిల్లా కలెక్టర్ గిరీశా పిఎస్
యువత అన్ని రంగాలలో రాణించాలి - ఎంపీ మిధున్ రెడ్డి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
యువత అన్ని రంగాలలో రాణించాలని.. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ గిరీశా పి.ఎస్, రాజ్యసభ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తెలియజేశారు. శనివారం వారు కొత్త బోయినపల్లి లోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ జాబ్ మేళాలో 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజంపేట, రైల్వే కోడూరు తో పాటు పొరుగు మండలాల నుంచి ఈ మెగా జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిధున్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీశా పిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి నేరుగా చేరాలన్న సంకల్పంతో సచివాలయ-వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన సులభతరం చేసి దేశానికే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిపిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు, వైయస్సార్సీపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments