నగరాన్ని అమ్ముకునే లీజు ప్రహసనం పాలకులకు తగదు!! (ఈట్ స్ట్రీట్ -వెండింగ్ జోన్ లీజు వేలం నిలిపివేయాలి .. పార్కుల ప్రయివేటీ కరణ తీర్మానం రద్దు చేయాలి) పౌరసంక్షేమ సంఘం
తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నగరాన్ని దశలవారీగా లీజుకిచ్చే వేలంపద్దతిలో స్మార్ట్ సిటీ యంత్రాంగం ముసుగులో అమ్మకాలు ప్రవేశపెడుతున్న పాలకుల తీరు వినాశనకర విధానమని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. నగర ప్రయోజనాలు విస్మరించిన కౌన్సిల్ తీరు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. పి ఆర్ కాలేజీ రోడ్డు నుండి ప్రజల అభ్యంత రాలతో తొలగించబడిన ఈట్ స్ట్రీట్, త్రిపురసుం దరీగుడివద్ద బాదంవారి వీధిలో వివేకానంద పార్కును ఆనుకుని రెండేళ్ల క్రిందట నిర్మించిన వెండింగ్ జోన్ ప్రదేశాన్ని లీజు పేరిట కొటేషన్లు పిలవడం సిగ్గు చేటైన విధానమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడిరమణరాజు పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు షెల్టర్లు నిర్మించాల్సిన కార్పోరేషన్ నగర ప్రదేశాలను లీజులకు అమ్ముకుంటున్న ధోరణి మేలు చేసే విధంగా లేదన్నారు. పి ఆర్ కాలేజీ రోడ్డులో ప్రభుత్వ విద్యా సంస్థ వద్ద ప్రయివేటు శక్తులతో ఈట్ స్ట్రీట్ నడిపించా లన్న వికృత ధోరణి తగదన్నారు. పార్కు వద్ద వెండింగ్ జోన్ ప్రదేశంలో వీధి వ్యాపారుల ప్రవేశం లేకుండా వాళ్ళనోరు కొట్టి దళారులకు లీజు కిస్తున్న విధానం రాబందుల పాల్జేయడం వంటిదన్నారు. దుమ్ము ధూళి చెలరేగే ట్రాఫిక్ రోడ్ల మీద 3చోట్లకు మార్పు చేసిన ఈట్ స్ట్రీట్ పేరిట రు.3కోట్లు, వెండింగ్ జోన్ ప్రదేశం పేరిట రు.50లక్షలు వెచ్చించి కార్పోరేషన్ పౌరధనాన్ని దుర్విని యోగం చేశారన్నారు. లీజులకు కాకినాడ నగరాన్ని ఇచ్చుకుంటూ పోతే సామాన్య బడుగు బలహీన పేద మధ్య తరగతి ప్రజలు జిల్లా కేంద్రంలో మనుగడ సాగించలేరన్నారు. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీ సి ఇ వో ప్రకటించిన లీజు నోటీస్ ను కార్పోరేషన్ పాలక వర్గం.. రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహ రించాలని.. స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ అనుచిత విధానాలను నియంత్రించాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం సంఘటితమై రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించు కుంటుందని హెచ్చరించారు. వివేకానంద గాంధీనగర్ జన్మభూమి బోటు క్లబ్బు లతో బాటుగా కాకినాడ నగరంలోని 38 పార్కులను కరోనా మొదటి వేవ్ కు ముందు 2020 డిసెంబర్ లో ప్రయివేటీకరణ చేయడానికి ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం చేశారని.. లీజు ప్రహసనం మొదలు పెట్టిన ప్రభుత్వం పార్కులను కూడా లీజులకు ఇచ్చే ప్రమాదం త్వరలోనే పొంచి వున్నందున తక్షణమే ఆ తీర్మానాన్ని కౌన్సిల్ రద్దుచేయాలని కూడా డిమాండ్ చేశారు. పాలకుల దుశ్చర్యలకు నిరసనగా కలసివచ్చే రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల ప్రముఖులతో ప్రజా ఉద్యమాన్ని రాజ్యాంగ బద్దంగా చేపడతామని తెలిపారు.
Commentaires