కిడ్నాప్ అయిన బియ్యం వ్యాపారి దారుణ హత్య
గుంటూరు జిల్లాలో కలకలం రేపిన బియ్యం వ్యాపారి కిడ్నాప్ కేసు కొత్త మలుపులు తిరిగింది. అపహరణకు గురైన బర్మబాసు.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ కాలువలో శవమై తేలాడు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే హత్యకు గురైయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో కిడ్నాపైన బియ్యం వ్యాపారి బర్మబాసు అంజి.. హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులోని గుండేరు కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభించగా.. గుర్తుతెలియని మృతదేహంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ప్రకారం అది బర్మబాసు అంజిదని భావించి.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు మచిలీపట్నం వెళ్లి మృతదేహాన్ని అంజిగా గుర్తించారు.
కిడ్నాప్ జరిగిన తర్వాత పోలీసులు సకాలంలో స్పందించకపోవటం వల్లే అంజి హత్యకు గురయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. కిడ్నాప్‌నకు గురైన అంజి కాల్ డేటాను, ఫోన్‌లో వివరాలను బయటపెడితే ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యం గురించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు నేతలు కోరుతున్నారు.
Comments