వైఎస్ఆర్ జిల్లా, కడప
జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి సోమవారం ఉదయం జిల్లా పంచాయతి సర్పంచుల సంఘం కార్యాలయం నందు కడప జిల్లా పంచాయతీల సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం ఏళ్లనూరుకు చెందిన సర్పంచ్ చంద్ర మోహన్ ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర మోహన్ ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ చంద్ర మోహన్ కుటుంబానికి ఆయన సానుభూతి వ్యక్తపరిచారు. ఏదో సాధించాలని రాజకీయాలలోకి వచ్చిన చంద్ర మోహన్ అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించటం వలన అతని కుటుంబం వీధిన పడిందని ఇందుకు గాను కడప జిల్లా పంచాయతీల సర్పంచులు తోచిన సహాయం చేయాలని ఆయన కోరారు. కొనిరెడ్డి తన అయిదు నెలల జీతాన్ని చంద్ర మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి జిల్లా వారీగా సర్పంచుల నుండి చందాలు వసూలు చేసి చంద్ర మోహన్ కుటుంబానికి అందించనున్నట్లు, ఈ చిరు సాయం అతని కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు విడతలుగా 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేయటం సంతోషకరమని, అయితే ఈ నిధులు పంచాయతీ కరెంట్ బిల్లులు కట్టాల్సి ఉండగా ఇది తమను నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. ఇక పోతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల బాధ వర్ణనాతీతం అని అభిప్రాయ పడ్డారు. ఇకనైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలు జిల్లాలోని సర్పంచులకు తగు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో సర్పంచులు కీలక పాత్ర పోషించవలసి వస్తుందని అందుకుగాను సర్పంచ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పెండ్లిమార్రి మండలం చీమల పెంట సర్పంచ్ వీర ప్రతాప్ రెడ్డి, చేర్లోపల్లి మండలం సర్పంచ్ ఎస్. గంగి రెడ్డి, ఖాజీపేట మండలం రావుల పల్లె సర్పంచ్ శివరామి రెడ్డి, బి. కొత్తపల్లి సర్పంచ్ జి. నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comentarios