మంత్రి సత్యకుమార్‌తో కొనిరెడ్డి భేటీ
అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ను వైఎస్సార్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి పొందడంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి విషయమై చర్చించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అలాగే ఆకస్మిక తనిఖీలు చేస్తూ వైద్యులను అప్రమత్తం చేస్తున్నారని, ఆసుపత్రి అభివృద్ధి కోసం వరదరాజులరెడ్డి చేస్తున్న కృషికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది గర్భిణులు ప్రసవం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి వస్తుంటారని తెలిపారు. సిజేరియన్ కేసులను ఇతర ప్రాంతాలకు సిఫార్సు చేయకుండా వారందరికీ ఇక్కడే ఆపరేషన్లు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఆసుపత్రిలో తగినంతమంది వైద్య సిబ్బందిని నియమించాలని, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తన సొంత పట్టణమైన ప్రొద్దుటూరు ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కొత్తపల్లె పంచాయతీ 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి ఉన్నారు.
Comentarios