కొత్తపల్లె పంచాయతీ ప్రజలు నన్ను క్షమించాలి - కొనిరెడ్డి
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీలో శుక్రవారం ఉదయం పంచాయతీ సెక్రటరీ నరసింహులు ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశం అసెంబ్లీ సమావేశాలను తలపించే రీతిలో జరగడం అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పటిష్టమైన పోలీసు బందోబస్తు పహారా, అడుగడుగా తనిఖీలు, సమావేశ ప్రాగణంలోకి పాత్రికేయుల నిరాకరణల మధ్య ఆధ్యంతం ఉత్కంఠత రేపుతూ సాగిన సమావేశం ఎట్టకేలకు గ్రూపు తగాదాల వలన దాదాపు తొంభయ్ అయిదు శాతం అంశాలను నిరాకరిస్తూ ఒక వర్గం వార్డు మెంబర్లు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశం కాగా, పాత్రికేయులను సమావేశ మందిరంలోకి అనుమతించకపోవటం ఇది మొదటిసారి కాకపోయినా, పోలీసుల ఆంక్షల వలన ఇరువర్గాలలో మాటకు మాట గొడవలు చెలరేగకపోవటం అభినందించదగ్గ విషయం అనే చెప్పాలి.
అసెంబ్లీ సమావేశాలను తలదన్నే రీతిలో జరిగిన ఈ సాధారణ సమావేశం ప్రత్యేకత సంతరించుకొంది, ఒక వర్గం నాయకులు తమ పంతాన్ని నెగ్గించుకోగా, మరో వర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సర్వత్రా చర్చేనీయాంశంగా మారాయి. సమావేశం అనంతరం కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను పంచాయతీ పరిధిలో గెలిపించిన వార్డు మెంబర్లు నేడు డబ్బులకు అమ్ముడుపోయి తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి పంచాయతీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్నారని, వార్డు మెంబర్లు అభివృద్ధికి పూర్తిగా సహకరించటం లేదని, తనకు తన వర్గానికి అభివృద్ధి మంత్రమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పంచాయతీ పరిధిలోని అమృతా నగర్ లోని పలు ప్రాంతాలలో ప్రజలకు తీవ్ర ఆటంకం కలిగిస్తూ వార్డు మెంబర్లు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు తాము తలపెట్టి సమావేశంలో చేర్చకు తీసుకురాగా వాటిని వార్డు మెంబర్లు తిరస్కరిస్తూ చేసిన ప్రతిపాదన తనను కలచివేసిందని, పంచాయతీ ప్రజలు తనను క్షమించాలని వేడుకున్నారు. అభివృద్ధికి దోహదపడని వార్డు మేంబర్లను అక్కడి ప్రజలు ప్రశ్నించాలని, కొన్ని రాజకీయ శక్తులు వార్డు మేంబర్లను ప్రలోభాలకు గురి చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పంచాయతీ అభివృద్ధికి సహరించి పనులు త్వరితగతిన పూర్తి చేయటానికి, ప్రజల మన్ననలను పొందటానికి దోహదపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లె పంచాయతీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
Comments