వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
తాజాగా పలు ఆరోపణల నేపథ్యంలో కొత్తపల్లె పంచాయతీ వార్తల్లోకి ఎక్కింది. రాయలసీమ జిల్లాలలో అతి పెద్ద పంచాయతీగా పేరొందిన కొత్తపల్లెలో వైసీపీ నాయకుల వర్గపోరు తారా స్థాయికి చేరింది అనటంలో ఎటువంటి సందేహం లేదు, బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పద్నాలుగు మంది పారిశుధ్య కార్మికుల తొలగింపు అంశం చిలికి చిలికి గాలి వానగా మారి, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పూటకో కొత్త మలుపు తిరుగతుండగా, నేడు ఇరువర్గాల ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వేరు వేరుగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ వారికి మద్దతు తెలుపుతూ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో సమ్మె అనివార్యం అని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఉదయం ఒక వర్గం వైసీపీ ఎంపీటీసీ, వార్డు మెంబర్లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అటు పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి, ఇటు పద్నాలుగు మంది పారిశుధ్య కార్మికులపై తీవ్ర విమర్శలు చేశారు. సాయంత్రం కొనిరెడ్డి వర్గానికి చెందిన ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతివిమర్శలు చేసి, ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. తాము ఎన్నడు అవినీతికి పాల్పడలేదని, తమ నాయకునిపై ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం సబబు కాదని హితువు పలికారు.
ความคิดเห็น