అనారోగ్యంతో బిజెపి సీనియర్ నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి మృతి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు బిజెపి సీనియర్ నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల గురువారం ఉదయం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నందు మరణించినట్లు సమాచారం. అహర్నిశలు ప్రొద్దుటూరు అభివృద్ధికై తన వంతు సహాయ సహకారాలు, పోరాటాలు, ద్దీక్షలు, ధర్నాలు చేసిన ధీశాలి బాల చంద్రా రెడ్డి. ఒక ప్రక్క బిజెపి పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తూ మరో ప్రక్క క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా తన వృత్తిని నిర్వహిస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధిని ఎల్లవేళలా కాంక్షిస్తూ, ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు కావలసిన మౌలిక వసతులైన రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, ప్రత్యేకించి త్రాగునీటికై ఆయన చేసిన ఉద్యమాలు నిరాహార దీక్షలు ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా గుర్తుంటాయి అనటంలో ఏమాత్రం సందేహం ఆశ్చర్యం లేదు.
కొవ్వూరు రామసుబ్బారెడ్డి రెండవ సంతానమైన కొవ్వూరు బాలచంద్రారెడ్డి ప్రొద్దుటూరులోని ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అలాగే ఎస్వీ విశ్వవిద్యాలయం నందు 1984లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. అనంతరం ఒక ప్రక్క వ్యవసాయం, మరో ప్రక్క రాజకీయాలలో తన ఉనికిని చాటుకుంటూ, కాంట్రాక్టర్ గా మంచి గుర్తింపు గౌరవం పొందారు. రాజకీయపరంగా 2004వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి 22,118 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలువగా, 2014వ సంవత్సరంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి 2210 ఓట్లతో ఐదవ స్థానంలో నిలిచారు. అటు బిజెపి అధిష్టానంతోను ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులతో సత్సంబంధాలు కలిగిన బాలచంద్రారెడ్డి పలు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. తమ ట్రస్ట్ ద్వారా ఉచిత అన్నదాన శిబిరాలు, ట్యాంకుల ద్వారా మంచినీటి వితరణ, ఉచిత నేత్ర చికిత్స శిబిరాలు, అంబులెన్సులు, పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యాభ్యాసం, పెన్నా నది ప్రవాహానికి చేయూత, అనారోగ్య బారిన పడి డబ్బులు వెచ్చించలేని వారికి ఆర్థిక సహాయం, రైతులకు గిట్టుబాటు ధర ఇన్సూరెన్స్ కోసం ధర్నాలు దీక్షలు, ప్రొద్దుటూరు మున్సిపల్ అనిబిసెంట్ మైదానం అభివృద్ధిలో బాలచంద్రారెడ్డి పాత్ర కొనియాడదగినది. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా మూర్తి సేవా తత్పరుడిగా పేరు పొందారు.
బాలచంద్రారెడ్డి మరణ వార్త విన్న ఆయన అభిమానులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రజలు, అభిమానులు, నాయకులు కార్యకర్తల కొరకు ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం కొవ్వూరు గ్యారేజ్ నందు ఉంచుతున్నట్లు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని కొవ్వూరు గ్యారేజీ నందు శాస్త్రోక్తంగా బాలచంద్రారెడ్డి అంత్యక్రియలు జరుపబడునని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.
Comments