కర్నూలు జిల్లా, కౌతాళం మండలం, కామవరం గ్రామం లో ఆధిపత్య రాజకీయాలకు బలై నరికి చంపబడ్డ, దళితులను పరామర్శించి సగం పరిహారం ఇవ్వడానికి వచ్చిన ఎస్సీ కమీషన్ చైర్మన్ కు ధన్యవాదాలని, చంపిన తరువాత కేసులుపెట్టి, పరిహారమివ్వడం కాకుండా, చంపుతున్నారని మొత్తుకుంటున్న దగ్గర దళితులకు రక్షణ కల్పించండని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు తెలియజేసారు.
శుక్రవారం స్థానిక ప్రభుత్వ స్టేట్ గెస్ట్ హౌస్ లో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, జిల్లా నాయకులు ఆర్ టి ఐ లక్ష్మి నారాయణ, అశోక్, సుధాకర్, సురేష్ లు ఎస్సీ కమీషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా లో దళితులపై ఆధిపత్య వర్గాల దౌర్జన్యాలు పెరిగి పోతున్నాయని, వాటిపై ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రం లోనే భూకబ్జాకోరుల భూ దాహానికి కర్నూలు మండలం, పసుపల గ్రామ దళిత మహిళలు, వృద్ధుల కాళ్ళు, చేతులు ఫ్రాక్చర్ అయ్యేలా దెబ్బలు తిని, 12 సంవత్సరాలుగా నివాసమున్న ఇండ్లను నేలమట్టము చేస్తే గుండెలు పగిలేలా ఏడ్చినా పోలీసులు గాని, రెవిన్యూ అధికారులు గాని పట్టించుకోలేదన్నారు. నందవరం మండలం గురుజాల గ్రామ వెలివేత సమస్య పరిష్కారం కాక ముందే కోడుమూరు మండలం అనుగొండ గ్రామం లో అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూడండి అని అడిగినందుకు గాను జనవరి 04 నుండి ఈ రోజు వరకు దళితులు వెలివేయబడ్డారన్నారు. కర్నూలు నగరం లోని బాలాజీ నగర్ లో ఎస్సీ కళాశాల విద్యార్థుల హాస్టల్ పక్కన అక్రమంగా సెల్ టవర్ నిర్మించారని దానివల్ల విద్యార్థులే కాక, టి కృష్ణవేణి అనే దళిత మహిళ అనారోగ్యానికి గురై మరణించిందన్నారు.
కమీషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పసుపల గ్రామాన్ని వెంటనే సందర్శించి వారికి న్యాయం చేస్తానని, అనుగొండ వెలివేత పై కేసు నమోదు చేయమని డియస్పి ని ఆదేశించారు. గురుజాల, అనుగొండ గ్రామాలను రెండింటిని రెండో దపా పర్యటనలో తప్పకుండ సందర్శిస్తానన్నారు. రాష్ట్రం లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వీటిపై కఠినంగానే స్పందిస్తామన్నారు.
Comments