top of page
Writer's picturePRASANNA ANDHRA

పోలి పంచాయతీలో భూఆక్రమణలు

పోలి పంచాయతీలో భూఆక్రమణలు

పోలి సుబ్బారెడ్డి పై ఆరోపణల వెల్లువ

దళితుల ఇళ్ల స్థలాలూ స్వాహా యత్నం

పనులను అడ్డుకున్న ఎంఆర్పిఎస్ నాయకులు

రాజంపేట, మండలంలో ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదే తరహాలో పోలి రెవెన్యూ గ్రామ పరిధిలోని 7 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు పోలి సుబ్బారెడ్డి ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2002 వ సంవత్సరంలో భూములు లేని నిరుపేద దళితులకు ఇళ్ల స్థలాల కై 831-బి సర్వే నెంబర్ లో ఒక్కొక్కరికి మూడు సెంట్లు చొప్పున 170 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. నాడు ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం లేకపోవడం వలన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయడంతో ఆ భూమిని కూడా స్వాహా చేసేందుకు జెసిబి, డోజర్లు పెట్టి చదును చేస్తుండగా గురువారం ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో దళితులు మూకుమ్మడిగా వెళ్లి చదును కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆక్రమిత భూమిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు, ఇళ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ కొండల్లో, గుట్టల్లో తమకు మంజూరు చేసిన భూములను కూడా ఆక్రమిస్తే తామెక్కడ నివసించాలని ప్రశ్నించారు. దళితుల భూముల జోలికొస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. తమకు కేటాయించిన భూమికి సమీపంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను అడ్డుపెట్టుకొని, వాటి ముసుగులో వాటికి సమీపంలోని వందల ఎకరాల భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తూ తమ ఇళ్ల స్థలాలను కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని ఇల్లు లేని నిరుపేద దళితులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కలుగజేసుకుని తమ భూములు తమకు దక్కేలా చూడాలని దళితులు మొరపెట్టుకుంటున్నారు.

ఎమ్మెల్యే గారూ మీరే దిక్కు


అగ్రవర్ణాలకు చెందిన అధికార పార్టీ నాయకులే తమ భూములను ఆక్రమిస్తే తాము ఇంకెవరికి చెప్పుకోవాలి.?, ఆక్రమించుకోవడానికి దళితుల భూములే కనిపించాయా?, ఎమ్మెల్యే గారూ.. మా భూములు కబ్జా కాకుండా భద్రత కల్పించి మీరే మాకు న్యాయం చేయాలి. మిగులు ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలైన దళితులకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సహకరించాలి.

2 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page