వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగా రెడ్డి తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, డ్వాక్రా మహిళలు చేపట్టిన నిరసన ర్యాలీ నేపథ్యంలో ఈ పాత్రికేయుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సందర్భంగా లింగా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కొందరు డ్వాక్రా మహిళల రుణాల దుర్వినియోగం పై మాట్లాడటం సమంజసమేనని, డ్వాక్రా సంఘాలు తమ అధినేత చంద్రబాబు దత్త పుత్రికగా ఆయన అభివర్ణిస్తూ, రాష్ట్ర స్థాయి నాయకుడు నారా లోకేష్ ను విమర్శించటం, డ్వాక్రా మహిళల్ని క్షమాపణ చెప్పమని మీడియా ద్వారా కోరటం ఆయన తప్పుబట్టారు. జాతీయ టీడీపీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ ని కించపరిచే విధంగా అపహాస్యం పాలు చేస్తూ నినాదాలు చేయటాన్ని ఖండించారు. ఎవరయినా పార్టీలకు అతీతంగా నాయకులను విమర్శించేటప్పుడు రాజకీయ పరభాష కలుషితం లేకుండా మాట్లాడాలని హితువు పలికారు. తమ నాయకుడు లోకేష్ మహిళలకు ఎందుకు క్షమాపణ తెలపాలని ప్రశ్నించారు.
ప్రవీణ్ రెడ్డిని కడప కారాగారము నందు లోకేష్ పరామర్శించటం తప్పేమీకాదని, తమ పార్టీలో నాయకులు ఆపదలో ఉన్నప్పుడు పరామర్శించటం వారికి ధైర్యాన్ని నింపటం పరిపాటని, గతంలో వై.ఎస్ రాజశేఖర రెడ్డి జీవిత ఖైదు పడ్డ వారిని స్వయానా కారాగారానికి వెళ్లి పరామర్శించినట్లు గుర్తు చేశారు. కాగా అవినీతిని సహించే ప్రసక్తే లేదని, ఆర్.పి గా వ్యవహరిస్తున్న భోగాల లక్ష్మి నారాయణమ్మ కుమార్తె లలిత నిధులు దుర్వినియోగం చేసివుంటే తప్పక నిధులు తిరిగి రప్పించాలని, పార్టీలకు అతీతంగా వ్యవహరించి డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు న్యాయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
Comments