top of page
Writer's picturePRASANNA ANDHRA

మంత్రిని కూడా వదలని లోన్ యాప్ సిబ్బంది

మంత్రి కాకాణిని కూడా వదలని లోన్ యాప్ సిబ్బంది... 79 కాల్స్ తో విసిగించిన వైనం...

లోన్ తీసుకున్న అశోక్ కుమార్

మంత్రి కాకాణి ఫోన్ నెంబరు ఇచ్చిన వ్యక్తి

దాంతో కాకాణికి ఫోన్ కాల్స్ బెడద

నెల్లూరు ఎస్పీకి వివరించిన మంత్రి

చెన్నైలో నలుగురి అరెస్ట్

కొంతకాలం కిందట లోన్ యాప్ నిర్వాహకుల వైఖరితో పలువురు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ యాప్ నుంచి రుణం తీసుకుని తన నెంబరుతో పాటు ప్రత్యామ్నాయ నెంబరుగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెంబరు ఇచ్చాడు. అశోక్ కుమార్ రుణం చెల్లించకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది ప్రత్యామ్నాయ నెంబరుకు ఫోన్ చేశారు.

అయితే, ఈ నెంబరు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిదని, ఆయనకు లోన్ తో ఎలాంటి సంబంధంలేదని పీఏ ఎంత చెప్పినా లోన్ యాప్ సిబ్బంది వినిపించుకోలేదు. లోన్ కట్టాల్సిందేనంటూ కొన్ని గంటల వ్యవధిలోనే 79 కాల్స్ చేశారు. ఆ సమయంలో మంత్రి ముత్తుకూరులో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఉన్నారు. లోన్ యాప్ కాల్స్ తో ఆయన విసుగెత్తిపోయారు. ఈ విషయాన్ని ఆయన నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించగా, సదరు లోన్ యాప్ చెన్నై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. కోల్ మేన్స్ సర్వీసెస్ అనే రికవరీ ఏజెన్సీ నుంచి కాల్స్ వచ్చినట్టు తేలింది. వెంటనే చెన్నై వెళ్లి లోన్ యాప్ కు సంబంధించిన నలుగురిని అరెస్ట్ చేశారు.

కాగా, వారిని విడిపించేందుకు పది మంది ప్రముఖ న్యాయవాదులు రావడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి కాకాణి వెల్లడించారు. ఏపీలో లోన్ యాప్ బ్యాచ్ ల ఆటలు సాగకపోవడంతో చెన్నై నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. లోన్ యాప్ నిర్వాహకుల అరాచకంతో అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మంత్రిగా ఉన్న తననే వారు వేధించారంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థంచేసుకోవచ్చని అన్నారు. ఎవరైనా లోన్ యాప్ ఆగడాలకు గురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాకాణి సూచించారు. కాగా, లోన్ యాప్ ముఠాను ఉచ్చులోకి లాగేందుకు తన పీఏ ద్వారా రూ.25 వేలు చెల్లించినట్టు మంత్రి వెల్లడించారు

30 views0 comments

Commentaires

Noté 0 étoile sur 5.
Pas encore de note

Ajouter une note
bottom of page