సీఎం జగన్ కు మద్దతుగా లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ - ఆహ్వానం..!
రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. కాగా.. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కొన్ని సూచనలతో జగన్ కు మద్దతుగా నిలిచారు. తాజాగా.. ఏపీ ప్రభుత్వం విద్యా సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న పాఠశాలల విలీన ప్రక్రియ పైన పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్నాయి.
జగన్ నిర్ణయంపై లోక్ సత్తా జేపీ దీని పైన ప్రభుత్వం అనేక వివరణలు ఇచ్చినా.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. విలీనం ప్రక్రియను నిలిపి వేయించాలని, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ వల్ల గ్రామాల్లో చాలా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ దీని పైన స్పందించారు. ఉపాధ్యాయులు గొప్ప వనరులని..వారిని సద్వినియోగం చేసుకోవాలంటే పాఠశాలల విలీనం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, దీనిని సరిగ్గా అమలు చేస్తేనే మంచి జరుగుతుందని సూచించారు.
ఏపీ ప్రభుత్వానికి సూచనలు విలీనం కారణంగా పాఠశాల దూరమైతే బడి నిర్వహణ ఖర్చును రవాణాపై పెట్టాలన్నారు. పాఠశాలలు.. విద్యార్ధుల లెక్కలను ఆయన వివరించారు. పాఠశాలల విలీనం సక్రమంగా జరగాల్సి ఉందని జేపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యలో భాగంగా ఒక్కో విద్యార్ధిపైన రూ 91 వేలు ఖర్చు చేస్తున్నా.. విద్యా ప్రమాణాలు తక్కువగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాగా, జగన్ ప్రభుత్వం తాజాగా ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలిసిందని.. విద్యా ప్రమాణాలను పెంచాలనే ఈ ఆలోచనను ఆహ్వనిస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వానికి జేపీ కొన్ని సూచనలు చేశారు.
అమ్మఒడి పైనా జేపీ వ్యాఖ్యలు అమ్మఒడికి వెచ్చించే తొమ్మది వేల కోట్ల రూపాయాల స్థానంలో రూ 9 కోట్లు ఖర్చు చేస్తే కొత్త సాంకేతికతతో విద్యా ప్రమాణాలు పెంచవచ్చని జేపీ చెప్పుకొచ్చారు. వరదలు రాకుండా చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. వేల కోట్ల రూపాయలతో నిరుత్పాదక ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ 5 వేల కోట్లు ఖర్చయ్యే కాల్వల ఆధునీకరణ పైన ఆలోచన చేయకపోవటం సరి కాదని జేపీ అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పుడు పాఠశాలల విలీనం పైన ముఖ్యమంత్రి ముందుకే అంటున్న సమయంలో.. జేపీ లాంటి మేధావుల మద్దతుతో ప్రభుత్వ నిర్ణయానికి బలం పెరిగినట్లుగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments