top of page
Writer's picturePRASANNA ANDHRA

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి / చరిత్ర

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకుని, పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గల జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలపై చిన్న చూపు తగదని, రాజకీయంగా తమను అగ్రకులాల వారు ఎదగనివ్వడం లేదని, ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 58 శాతం ఓటర్లు ఉన్న బీసీలకు ఎక్కడా కూడా రాజకీయ ఎదుగుదల సమాన గౌరవం దక్కటం లేదని వాపోయారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనగణన జరిపించాలని అప్పుడే పార్టీలు తమను గుర్తించి రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు Dr సోమా లక్ష్మి నరసయ్య, సహా అధ్యక్షుడు సందు శివ నారాయణ, ప్రధాన కార్యదర్శి బీవీ రాజు, కోశాధికారి వెంకట కృష్ణయ్య యాదవ్, ఉపాధ్యక్షులు జింక రాజశేఖర్, కాలే దేవానంద్, కార్యదర్శులు కత్తి విజయ్ కుమార్, రమేష్ రాజు, జనార్ధన్, వడ్డే బాల పెద్దాయ్య, కమిటీ సభ్యులు గుండుమల్ల శంకర్, రామ సుబ్బయ్య, ఇల్లూరు ఓబులేసు, దందు బల సుబ్బయ్య, దొడ్ల లక్ష్మన్న, అల్లి తుకారాం, వుట్టి తిరుపతయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే గురించి క్లుప్తంగా :


మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి నివాళి...


చంపేందుకు వచ్చినవాడికి చదువు చెప్పిన పూలె


భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు మహాత్మ జోతిబా పూలె. విద్య ద్వారానే సమాజంలో మెరుగైన మార్పులు వస్తాయని నమ్మిన జోతిరావు పూలె అందుకోసం పాఠశాలలు స్థాపించాడు. ఆ పాఠశాలల్లో బాలికలతో పాటుగా శూద్రులు, అతిశూద్రులకు కూడా ప్రవేశం కల్పించాడు. ఇట్లా శూద్రులకు, మహిళలకు విద్యాబోధన చేసినట్లయితే నరకానికి పోతావని బ్రాహ్మణులు శపిస్తారు. పూణె కేంద్రంగా 1818వరకు రాజ్య పాలన చేసిన పీష్వాలు బ్రాహ్మణులు. ఆ తర్వాత కూడా తమదే రాజ్యంగా ప్రవర్తించారు. నిజానికి దేశంలో పూణె బ్రాహ్మణాధిపత్యానికి కేంద్రం. పాలన బ్రిటీషు వారి చేతిలో ఉన్నప్పటికీ మాట మాత్రం బ్రాహ్మణులదే చెల్లుబాటయ్యేది. అయినప్పటికీ మనువాదానికి, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా జోతిరావు పూలె పెద్ద పోరాటమే చేసిండు. మూఢనమ్మకాలు, మూఢాచారాలు, శ్రాద్దాలు, కర్మకాండ ఇట్లాంటి అన్ని ఆచారాలకు వ్యతిరేకంగా పూలె పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాడు. బ్రాహ్మణులు వల్లించే వేదమంత్రాలు, బోధనలకు వ్యతిరేకంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మంగళాష్టకాలు రాసిండు. పావడా ద్వారా శూద్రుడైన శివాజీ ఘనతను, గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పిండు. ఇట్లా ఆయన చేసే పనులన్నీ బ్రాహ్మణులకు కంటగింపుగా ఉండడంతో వారంతా కూడబలుక్కొని పూలెను హతమార్చాలని నిర్ణయిస్తారు. ఇందుకు అనుగుణంగా ఇద్దరు యువకులను ఇందుకోసం ఎంపిక జేసిండ్రు. వారికి చెరో వెయ్యి రూపాయ ఇచ్చి వారి చేత హత్య చేయించడానికి నిర్ణయిస్తారు. ఆ రోజుల్లో వెయ్యి రూపాయలంటే పెద్ద మొత్తంగానే పరిగణించాలి.

పూలెను హత్య చేయడానికి సుపారీ తీసుకున్న దొండిరామ్‌ నామ్‌దేవ్‌ కుంభార్‌, రామోషి అలియాస్‌ సోమ్‌నాథ్‌ రోడె ఇద్దరూ తేజయిన కత్తులను తీసుకొని అర్ధరాత్రి పూలె ఇంట్లోకి చొరబడతారు. వీళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటుండంతో పూలెకు మేల్కొచ్చింది. కత్తుల చేతిలో బట్టుకున్న ఇద్దరినీ చూస్తూ ఎందుకొచ్చారని సౌమ్యంగానేఅడుగుతాడు. దీనికి వారుకూడా బెణకకుండా మిమ్మల్ని హత్య చేయడానికి వచ్చామని జవాబిచ్చారు. నన్ను హత్య చేస్తే మీకేమొస్తది? అని ప్రశ్నించాడు. నేనేమైన మీకు నష్టం చేశానా? అని అనునయ పూర్వకమైన గొంతుతో వాళ్ళను అడిగిండు. నేనేమైన తప్పుచేశానా? చెప్పండి అంటూ అడిగిండు. దీంతో మాంగ్‌ కులానికి చెందిన రామోషి, కుమ్మరి కులానికి చెందిన దొండిరామ్‌ ఇద్దరూ ‘‘మిమ్మల్ని హతమారిస్తే మాకు చెరో వెయ్యి రూపాయలు వస్తాయని’’ చెప్పిండ్రు. అలానా అయితే ‘ఇదిగో నా తల.. దీన్ని నరికి’ మీకు రావాల్సింది తీసుకోండి అంటూ పూలె మెడను వంచుతాడు. అట్లాగే సంతోషం కూడా. ఎందుకంటే నా జీవితం మొత్తం పేదవారికి, కింది కులాల వారికి సహాయం చేస్తూ వచ్చాను. చదువు చెప్పి వాళ్ళని యోగ్యులుగా తయారు చేస్తు ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా పేదవారే కాబట్టి నన్ను చంపితే మీకు లాభం కలుగుతుంది కాబట్టి ఎలాంటి శషబిషలు లేకుండా నా కంఠాన్ని నరికేయండి అని పూలె వాళ్లతోటి చెబుతాడు. ఈ సంఘటన 1856లో జరిగింది.

పేదవారి కోసం ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధమయిన పూలెను చూసి చంపడానికి వచ్చిన ఇద్దరు కూడా ఆయన మాటతో మనసు మార్చుకొని కాళ్ళమీద పడతారు. నిజంగా దేవుడే ఈ నేల మీద నడయాడుతున్నాడని భావిస్తూ మమ్మల్ని క్షమించమని వాళ్లు ప్రాధేయపడతారు. అందుకు పూలె వారిని ఓదారుస్తూ నన్ను చంపడానికి పంపించిన వారిని కూడా మీరు క్షమించేయండి. అట్లనే హత్యకు పురిగొల్పింది వారిని గురించి కూడా ఎక్కడా చెప్పకండి అంటూ బోధిస్తాడు. ప్రపంచంలో క్షమాగుణానికి మించిన శిక్ష ఏమీ లేదని చెబుతాడు. ‘‘వారేమి చేయుచున్నారో వారికి తెలియదు. వాండ్లు కలకాలం బతకాలి’’ అని దీవిస్తాడు. అనంతరం ఈ ఇద్దరు కూడా దేశంలోనే మొదటిసారిగా పూలె నడిపించిన రాత్రి పాఠశాలో విద్యార్థులుగా చేరిండ్రు. ఇందులో రామోషి తర్వాతి కాంలో పూలెకు బాడిగార్డ్‌గా పనిచేసిండు. అంతే గాకుండా సత్యశోధక్‌ సమాజ్‌ కార్యక్రమాల్లో మార్దవమైన గొంతుతో పాటలు పాడి ఉద్యమం దళితవాడల్లో సైతం ఎక్కువగా ప్రచారం కావడానికి తోడ్పడ్డాడు. మరోవైపు దొండిబా రాత్రి పాఠశాలలో చదువుకున్న తర్వాత కాశి వెళ్ళి అక్కడ సంస్కృతాన్ని చదువుకొని పేరుమోసిన పండితుడయ్యిండు.


దొండిరామ్‌ నామ్‌దేవ్‌ కుంభార్‌ సత్యశోధక్‌ సమాజ్‌ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. ఆ ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడంలో ఆయన చేసిన కృషి గణనీయమైంది. సత్యశోధక్‌ సమాజ్‌ కార్యక్రమాల ప్రచారం కోసం కొన్ని పుస్తలకాను కూడా రాసిండు. అందులో ఒకటి ‘వేదాచార్‌’. ఈ పుస్తకం అట్టపై అని “Satya Shodhak Samaj - Vedachar by S.S. Pandit Dhondiram Namdeo Swami of Jest Shrengeri Kudalgi and S.S. of S. Shankaracharya’s estate, and printed and published by Laxman rao Gopala rao Sawant for the information of backward classes’. ఆంగ్లంలో రాసి ఉంది. మరో పుస్తకం ‘సత్యశోధక్‌ తమాషా’ పేరిట 1897లో మెవరించాడు. ఈ పుస్తకం ప్రతి లండన్‌ ఇండియా ఆఫీస్‌ లైబ్రరీలో ఉన్నట్టు ఇటీవలి పరిశోధన వల్ల తేలింది. సత్యశోధక్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాడు కావడంతో 1875లో ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ పూణె సందర్శనకు వచ్చినపుడు ఆయనకు స్వాగతం పలుకుతూ మరో సత్యశోధక్‌ సమాజ్‌ నాయకుడు కృష్ణారావు భాలేకర్‌తో కలిసి గీతాలాపించిండు.


1838లో జన్మించిన దొండిరామ్‌ మొదట్లో కొంత చెడు సహవాసాలు చేయడంతో పూలెను చంపడానికి సుపారీ తీసుకుంటాడు. అయితే జ్ఞానోదయమైన తర్వాత రాత్రి పాఠశాలలో చదువుకోవడమే గాకుండా ఇన్ని రోజు బహుజనులకు దూరంగా ఉంచిన సంస్కృతాన్ని అధ్యయనం చేయాలనే తన కోరికను పూలె దగ్గర వెల్లడించాడు. దీంతో పూలె పూనుకొని దొండిరామ్‌ని సంస్కృతాధ్యయనం కోసం కాశికి పంపిస్తాడు. అక్కడ వివిధ గురువుల దగ్గర చదువుకొని పూర్తి జ్ఞానంతో పూణెకు వస్తాడు. అక్కడ పూలె నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. సత్యశోధక్‌ సమాజ్‌ స్థాపన తర్వాత దాని ప్రచారానికి తన జీవితం మొత్తం పని జేసిండు. వర్ణానికి సంబంధించి బ్రాహ్మణులు తీసుకొచ్చిన సిద్ధాంతాలను తప్పని ఒక పండిత గోష్టిలో రుజువు చేస్తాడు. మతం, వర్ణం కు సంబంధించి వేదాల్లో ఉన్న విషయాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పామర భాషలో తెలియజెప్పేవాడు. అంతేగాదు వేదాల్లో పశుమాంసం తినడం, మొదలైన అంశాలకు సంబంధించి రికార్డయిన విషయాలను అందరికీ తెలియజెప్పిండు. పూర్తిగా స్వచ్ఛమైన సంసృతంలో మాట్లాడ్డమే గాకుండా, ఆచారాల గురించిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ‘మతం అనేది సామాన్య ప్రజల భావన. దేవుడు మతాన్ని సృష్టించలేదు’ అని దొండేరామ్‌ చెప్పేవాడు. ఈయన జ్ఞానాన్ని మెచ్చుకొని శృంగేరి శంకరాచార్య ‘సర్సుభా’ అనే బిరుదుని ప్రదానం చేసిండు. అంటే ఆచార, వ్యవహార విషయాల్లో నిపుణుడు అని అర్థం. 189-`96 మధ్య కాలంలో ‘సత్యశోధక్‌ సమాజ్‌’ తరపున వెలువడ్డ పత్రిక ‘దీనబంధు’లో ఈయన గురించి అనేక వివరాలు ప్రచురితమయ్యాయి.


పూలె అంత్యక్రియ సమయంలో అన్ని తానే అయి కార్యక్రమాలు నడిపించిన పండిత దొండిరామ్‌ 1905లో చనిపోయిండు. ఒక ఆదర్శ గురువు స్ఫూర్తివంతమయిన శిష్యుణ్ణి తయారు చేసుకున్న విధం మనకు దీనివల్ల తెలుస్తున్నది.

130 views1 comment

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 11, 2023
Rated 5 out of 5 stars.

జయహో బీసీ

Like
bottom of page