కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా మార్చి 13వ తేదీన కడప జిల్లా మైదుకూరులో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ 2వ కడప జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కన్వీనర్ ఏ రామ్మోహన్, కో - కన్వీనర్ చంద్రారెడ్డి, జిల్లా నాయకులు గోవిందు , ఖాదర్ బాషా తెలియజేశారు.
శుక్రవారం నాడు కడప నగరంలోని పాత బస్టాండ్ లో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు పాల్గొన్నారు. కడప జిల్లాలో దాదాపు లక్ష మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వీరందరికీ పని లేక ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా కార్మికుల వివరాలు మాత్రమే సేకరించారని కానీ, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేసిన పాపాన పోలేదని వారు తీవ్రంగా విమర్శించారు.
జిల్లా మహాసభల సందర్భంగా మైదుకూరులో ర్యాలీ సభ జరుగుతాయని, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
కావున జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున మార్చి 13వ తేదీన జరిగే జిల్లా మహాసభలకు మైదుకూరు కు తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
Комментарии