కూరగాయల మార్కెట్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొదలు
50 కోట్ల 90 లక్షలతో దసరా అనంతరం పనులు ప్రారంభం
ప్రతిపక్ష నాయకుల దుష్ప్రచారంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 6
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో శివాలయం ఎదురుగా నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం 50 కోట్ల 90 లక్షలతో బుధవారం టెండర్ ప్రక్రియ మొదలవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతన మార్కెట్ నిర్మించి గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహకారంతో మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా అద్వాన స్థితిలో ఉన్న మార్కెట్ను తొలగించి 2.37 ఎకరాలలో అత్యాధునిక వసతులతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో నిర్మాణం ఉంటుందన్నారు. టెండర్ ప్రక్రియ అనంతరం అక్టోబర్ లో పనులు ప్రారంభిస్తున్నామని తెలుపుటకు సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన కొత్త మార్కెట్ నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరమన్నారు తాను 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్కెట్ నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చాను అన్నారు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రొద్దుటూరు నియోజకవర్గం పై సవతి తల్లి ప్రేమ చూపించి ఒక్క లక్ష రూపాయల అభివృద్ధి కూడా జరగకపోవడానికి కారణమయ్యారన్నారు.
మార్కెట్ నిర్మాణంపై ప్రతిపక్ష నాయకుల అసత్య ఆరోపణలు దుష్ప్రచారాలపై ఆయన నిప్పులు చెరిగారు. మార్కెట్ నిర్మాణం పనులు ప్రారంభమైన కేవలం అధికార పక్షాన్ని విమర్శించాలన్న సాకుతో భవిష్యత్తులో దుష్ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమి చేయలేదని 520 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వారికి లేదన్నారు. పెన్నా నదిపై హై లెవెల్ వంతెన, నూతన బస్టాండ్ నిర్మాణం, ఐదు ప్రధాన కాలువల ఆధునీకరణ, నూతన త్రాగునీటి పైపులైన్ల ఏర్పాటు, వైయస్సార్ ఇంజనీరింగ్ కళాశాలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, ఎస్ సి ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ మొదలైంది అన్నారు.
సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 800 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాలలో జమ చేసిన సంగతిని గుర్తు చేశారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల సహకారం చేసేందుకు 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అలాంటి ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే ప్రజలు సంతోషంగా ఉంటారని ఒక్క ప్రతిపక్ష నాయకులకే బాధగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కమిషనర్ రమణయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు, మునిరెడ్డి కౌన్సిలర్లు వైసిపి నాయకులు మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు.
Comentarios