అబద్దాలనే నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రవీణ్ - ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కేవలం అబద్దాలనే నమ్ముకున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఛైర్మన్ ఛాంబర్ లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కేవలం అబద్దాలనే నమ్ముకున్నారని, ఆ అబద్దాన్ని కూడా నిజమని నమ్మేలా మసిపూసి మారేడు కాయ చేయడం అతని నైజమని విమర్శించారు. గతంలో వున్న మాజీ ఎమ్మెల్యే లు ఎంవి రమణారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, తదితర నాయకులు ఎవరూ అబద్దమనే ఆయుధంతో రాలేదని, అది కేవలం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒకనికే చెల్లిందన్నారు. ప్రొద్దుటూరు లో ఏ చిన్న సంఘటన జరిగినా తనకే ఆపాదించడం, తాను చేయని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు చెప్పడమే అతని పని అని వివరించారు. వ్యాపారుల పై ఇన్ కం ట్యాక్స్ దాడులు జరిగి తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడితే తనకు లాభమా అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపే ఎన్నికల కమిషన్ దాడులు చేయించి సామాన్యులు, వ్యాపారులను ఇబ్బంది పెడితే తాను ప్రశ్నించి, వారికి అండగా నిలిచానని, దానిని కూడా తానే చేయించానని, తిరిగి తానే సానుభూతి కోసం వారికి మద్దతిచ్చానని మాట్లాడటం సమంజసం కాదన్నారు. రాజకీయ నాయకుడిగా పదవి నిలుపుకునేందుకు కావాల్సింది సామర్థ్యమే కానీ సానుభూతి ఎంతమాత్రం కాదన్నారు. ఎగ్జిబిషన్ లో ఫ్రీ ఎంట్రీ పెడితే లోపల అధిక ధరలకు విక్రయించారని, దానికి తానే కారణమనడం అవివేకమన్నారు. కరోనా వచ్చిన సమయంలో తాను, తమ వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులే ప్రజలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. ప్రవీణ్ తనపై చేసే వన్ని నిరాధార ఆరోపణలే అని, వాటిని అతనే నిరూపించలేడన్నారు. నందం సుబ్బయ్య హత్య కేసులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని, తనకు ఆ విషయం తెలియదని, తెలిసి వుంటే ఆపేవాడినని ఈ విషయం చౌడేశ్వరి దేవి వద్ద ప్రమాణం కూడా చేశానని వివరించారు. తాను హింసను ప్రోత్సహించనని, శాంతినే ప్రోత్సహిస్తా నని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఎక్సైజ్ పోలీసు స్టేషను కు వెళ్లింది కూడా కౌన్సిలర్ రావులకొల్లు అరుణ ఇంటి సమీపంలోని పేద వాడైన తొగట కులస్థుడి కోసమని, అతని తల్లి కర్మకాండ సమయంలో 7 ఫుల్ బాటిల్స్ తీసికొని వెళ్తే ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటే కౌన్సిలర్ భర్త నాగేంద్ర ను ఆశ్రయిస్తే, అతని మాట వినని పక్షంలో తానే స్వయంగా ఎక్సైజ్ పోలీసు స్టేషను కు వెళ్లి వారి తరపున మాట్లాడానని, ఆ సమయంలో దురుసుగా వ్యవహరించానని, తన మాటలకు క్షమాపణ చెప్పానని వివరించారు. ఈ విషయంలో తనపై కూడా కేసు నమోదైందని తెలిపారు. ఓటుకు, ఓటర్లకు రాచమల్లు సదా సేవకుడని తెలిపారు. ఇటీవల మహబూబ్ బాషా అనే వ్యక్తి ని టిడిపి నాయకులు తిప్పిరెడ్డిపల్లె దస్తగిరి, అతని కుమారుడు వారికి గతంలో రావాల్సిన బాకీ విషయంలో దాడి చేసి, కిడ్నాప్ చేశారని, ఈ విషయమై మహబూబ్ బాషా కుటుంబ సభ్యులు ఫిర్యాదు తో పోలీసులు వారిని స్టేషన్ కు పిలిపిస్తే తిరిగి స్టేషన్ లో కూడా వారిపై దాడి చేశారని, తిరిగి వీరిపైనే కేసు నమోదు చేయలేదని ప్రవీణ్ స్టేషన్ లో నియమావళిని అతిక్రమించి నిరసన వ్యక్తం చేయడం దారుణమన్నారు. రాచమల్లు రాజ్యాంగం అంటారని, పోలీసులు తన మాటే వింటారని, అందులో భాగంగానే అతనిపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొనడం సరికాదని, ప్రవీణ్ లోకేష్ మాట విని టికెట్ కోసం కేసులు పెట్టేలా చేస్తున్నారని విమర్శించారు. జిల్లా ఎస్పీ, పోలీసులు నిష్పక్షపాతముగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున ప్రజలు రెండు కన్నులతో ప్రవీణ్ అబద్దాలను గుర్తించాలని కోరారు. ప్రజలు నిజానిజాలు తెలుసుకుని సత్యం వైపు నిలవాలని, పోలీసులు నిష్పక్షపాతముగా వ్యవహరించి తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని వివరించారు.
Коментарі