నా ఫోన్ హ్యాక్ చేసి నన్ను అంతమొందించడానికి కుట్రలు చేస్తున్నారు - ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు
వైయస్సార్ కడప జిల్లా, కడప సిటీ
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తన వ్యక్తిగత జీవితాన్ని సాంకేతికంగా టార్గెట్ చేస్తూ తనను అంతమొందించడానికి లేదా రాజకీయాల నుండి శాశ్వతంగా దూరం చేయడానికి కుట్ర జరుగుతోందని ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ని ఎస్పీ బంగ్లా నందు కలిసి, తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలోని ఒక కంపెనీతో దాదాపు 50 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకొని, సదరు ఒప్పందం ద్వారా తనను భౌతికంగా అంతమొందించటమా లేక రాజకీయంగా దూరం చేయటమా, అనే కోణమై తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు కుట్రపన్నారంటూ సంచలన ఆరోపణలు చేసి, ఇందుకుగాను నాలుగో వంతు భాగం అడ్వాన్స్ చెల్లింపులు కూడా సదరు ఆస్ట్రేలియా కంపెనీకి ముట్టినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా పూర్వకంగా వెల్లడించారు. రానున్న రోజులలో తనతో పాటు సహచర వైసీపీ ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ అయ్యే అవకాశం లేకపోలేదని, కావున వైసీపీ ఎమ్మెల్యేలందరూ జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చారు. ఇదిలా ఉండగా 2024 ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ, అధిష్టానం నుండి ఈ మేరకు స్పష్టమైన సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత నాలుగున్నర సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ పదవి అనుభవించిన సి. రామచంద్రయ్య ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వైసిపి ప్రభుత్వ పనితీరుపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా 130 నియోజకవర్గాలలో గెలవనున్నట్లు ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు వెంట పలువురు వైసీపీ నాయకులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
Comments