బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు చేస్తున్నారు - ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపారులు, వర్తకులు బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు చేస్తున్నారని, కాపుకాసి మాటు వేసి మరి పోలీసులు తనిఖీల పేరుతో వ్యాపారస్తులను వేధిస్తున్నారంటు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఉదయం బంగారు అంగళ్ళ కూడలి వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేస్తూ, ఇకనైనా వ్యాపారస్తులపై పోలీసుల వేధింపులు ఆపాలని కోరారు. సామాన్యుల దగ్గర నుండి వ్యాపారస్తుల వరకు పోలీసుల తనిఖీలు పెద్ద సమస్యగా మారిందని, కరోనా తర్వాత వ్యాపారాలు పొంచుకున్నాయని ఆనందించే లోపు, రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు వ్యాపారస్తులను బెంబేలెత్తిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి బంగారు అంగళ్ళు, సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తనిఖీలు చేపట్టడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులను ప్రశ్నించారు? పోలీసులు తనిఖీలు ఆపకపోతే వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు సామూహికంగా బంద్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించారు. బాధ్యత గల ప్రభుత్వమే సమస్యను సృష్టిస్తే ఎలా అంటూ, వరుస దాడుల నేపథ్యంలో వ్యాపారులలో ఆందోళన మొదలైందని, రాజకీయ వర్గాలకు చెందిన నాయకుల వాహనాలను పోలీసులు తనిఖీ చేయాలని, వ్యాపార వర్తకులను వేధించవద్దంటూ ఆయన హితవు పలికారు. త్వరలో ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని, పోలీసులు వ్యాపారస్తులకు సహకరించి ఎన్నికల కోడ్ నియమ నియమావళి వచ్చేవరకు తనిఖీలు ఆపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలపై పోలీసు అధికారులు వివరణ ఇవ్వాలని ఆయన కోరుతూ, తాను నిరసన తెలుపుతున్న ప్రాంతానికి పట్టణ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిఐలను పిలిపించి వారి వివరణ తీసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని డీఐజీ కార్యాలయానికి వెళ్లి సమస్యను తెలియజేయనునట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, వ్యాపార, వర్తక సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
Comentarios