కక్ష సాధింపు చర్యలు మా అభిమతం కాదు - ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి టిడిపి బిజెపి జనసేన కలయిక ప్రభంజనం సృష్టించిందని, వైసీపీ తన క్యాడర్ నిలబెట్టుకోవటానికి కూడా కష్టతరంగా తయారైందంటూ ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, చరిత్రలో ఏ పార్టీ కూడా వైసీపీ లాగా దుర్భర ఓటమిని చవి చూడలేదని, 2019 ఎన్నికలలో టిడిపి 23 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రతిపక్షంలో నిలిచిందన్నారు. నేడు వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదని అన్నారు. తమ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు, ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని ఆదేశించారని, రానున్న ఐదు సంవత్సరాలలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ అటు రాష్ట్రాన్ని ఇటు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తామని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ ప్రజా సంక్షేమ పాలనను అందిస్తామని స్పష్టం చేశారు.
ఇకపోతే ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరుకు విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామని హామి ఇచ్చారు. ప్రజలు ఏ కష్టం వచ్చినా, తమకు జరిగిన అన్యాయాలపై తనను సంప్రదించవచ్చునని, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అందరి సూచనలు సలహాలను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు ఆశించిన దానికన్నా అత్యధిక మెజారిటీని అందించిన నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటానని, సమయం సందర్భాన్ని బట్టి తగు చర్యలు తీసుకుని అంచలంచెలుగా అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి, మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు, తదితరులు పాల్గొన్నారు.
Commentaires