వైసిపి త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం - ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎన్నికల హామీలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారనీ, త్వరలో మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తారని ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరద మాట్లాడుతూ, ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్ శాఖతో రివ్యూ నిర్వహించామని, నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న కాలనీలలో 23 వేల మంది లబ్ధిదారులకు ఇచ్చిన ఒక సెంటు ఇంటి స్థలంలో గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని, త్వరలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించి ప్రొద్దుటూరు అభివృద్ధికి కావలసిన చర్యలు చేపడతామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్లు, అలాగే పెన్నా నదిపై నిర్మిస్తున్న ఆర్టిపిపి బ్రిడ్జి పనుల కాంట్రాక్టర్ తనను కలిసి దాదాపు 14 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని చెప్పారన్నారు.
కావున రానున్న రోజులలో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎంత మేరకు నిధులు అవసరము అనే వివరాలు, అన్ని శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలలో తన ఘలం వినిపించనున్నట్లు, అభివృద్ధి పనులకు కావలసిన నిధులు తమ ప్రభుత్వంలో మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రజలకు దూరం చేసి కేవలం నవరత్నాలు మాత్రమే ప్రజలకు అందించారని, రానున్న రోజులలో వైయస్సార్సీపి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధినాయకులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోందన్నారు. 2029 నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలు మరిచిపోతారని జోస్యం చెప్పారు.
అనంతరం మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేశారని రానున్న రోజులలో సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఆసం రఘురాంరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, ఈవి సుధాకర్ రెడ్డి, కామిశెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments