టిడిపి శ్రేణులకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్న - ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తనపై అలాగే తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసే ముందు వైసీపీ నాయకులు ఆధారాలతో ముందుకు రావాలని, మట్కా, అక్రమ ఇసుక రవాణా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ స్థావరాలపై ఉక్కు పాదం మోపమని తానే స్వయంగా పోలీసులను కోరినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, గత కొద్ది రోజుల క్రితం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది పాతకోట బంగారు మునిరెడ్డి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఎన్విఆర్ఆర్ అనే స్టిక్కర్ గల టిప్పర్లు పట్టుబడగా అవి తనవేనని తన పేరుపై ఉన్నవని అసత్య ఆరోపణలు ప్రజలలోకి జొప్పించే ప్రయత్నం చేశారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని టిప్పర్లు కమలాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తివని అన్నారు. గడచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రోజుకో తప్పు చేస్తూ, 2024 ఎన్నికలలో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని, అలాంటి తప్పులు తాము చేస్తే ఇదే పరిస్థితి తమకు పునరావృతం అవుతుందని తెలుసును కాబట్టి ఎలాంటి అవినీతికి తావివ్వకుండా సుపరిపాలన అందించే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాము అవినీతిరహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే కడప జిల్లాకు నిజాయితీగల ఎస్పీని ప్రభుత్వం నియమించి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరగకుండా పటిష్టంగా పోలీసు శాఖ విధులు నిర్వహిస్తోందని కితాబిచ్చారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని, తప్పు ఎవరు చేసినా శిక్షించాలని తానే స్వయంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తమ నాయకులు కూడా సక్రమమైన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీనియర్ టిడిపి నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comentários