39వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అనిల్ టిడిపిలో చేరిక
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ 39వ వార్డు కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్ శనివారం ఉదయం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్ లోని టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే వరద టిడిపి కండువా కప్పి కౌన్సిలర్ అనిల్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు వ్యత్యాసం గమనించిన కౌన్సిలర్ అనిల్ టిడిపిలో చేరటం సంతోషించదగ్గ విషయమని, అనిల్ రాకతో ప్రస్తుతానికి వైసీపీని వీడి 14 మంది టీడీపీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. రానున్న రోజులలో 39వ వార్డును అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టిటిడి లడ్డు ప్రసాదంపై దేశవ్యాప్తంగా ఏర్పడ్డ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని పలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా నిలిపి వేసుకున్నారని, ఆలయ సంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాలని, అన్యమతస్తుడు కావడం చేతనే తిరుమలలో డిక్లరేషన్ అడిగారని, సంప్రదాయాన్ని వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదని హితువు పలికారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో పూర్తి బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత జగన్ కు ఉందని, లడ్డు కల్తీని హిందువులు వ్యతిరేకిస్తున్నారని, పరిపాలన పరిశీలన నాటి ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వలన ప్రస్తుతం జగన్ కు ఏర్పడి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments