ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
-పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, సబ్ కలెక్టర్
- డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాజంపేట డివిజన్ కేంద్రంలోని రాజంపేట, నందలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో సోమవారం జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. రాజంపేట మినహా అన్ని మండలాలలో నిర్ణీత సమయానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజంపేట పట్టణంలో మన్నూరు జెడ్పి ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పట్టభద్రుల ఓటర్లకు సంబంధించి సాయంత్రం నాలుగు గంటలు దాటినప్పటికీ భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజంపేటలో 420 ఉపాధ్యాయుల ఓటర్లు ఉండగా 388 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.3665 మంది పట్టభద్రులు ఉండగా 2503 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ పక్రియ సరళిని ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి భారీ బందోబస్తు నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులను ఏర్పాటు చేశారు. రెండు పోలింగ్ కేంద్రాలలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఓటర్లను మాత్రమే లోపలికి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో పట్టణ సిఐ నరసింహారావు, ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై భక్తవత్సలం, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments