ఉక్క నగరం, ప్రజా సంపదలపై కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటించండి అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఈరోజు స్టీల్ గుర్తింపు యూనియన్( సి ఐ టి యు) ఆధ్వర్యంలో ఉక్కునగరం సెక్టర్ -1 స్టీల్ క్లబ్ లో" విశాఖ ఉక్కు పై కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా రక్షణ కోసం జరిగే ప్రత్యామ్నాయ విధానాలను వివరించడం" అనే అంశంతో సెమినార్ నిర్వహించారు. దీనికి ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ దేశానికి సంపద సృష్టిస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గుత్త పెట్టుబడిదారులకు ఉచితంగా అందిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశంలో ప్రతి పరిశ్రమలోనూ జరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటనకు సిద్ధం కావాలని ఆయన వివరించారు. దేశంలో పెరుగుతున్న నేడు పేరెన్నికగన్న సంపన్నులు 2004కు ముందు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఓట్ల రాజకీయాలతో రాజకీయ పక్షాలు తమ స్వలాభాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి అని ఆయన అన్నారు. కార్మికుల సులభమైన పరిశ్రమలను కాపాడుకోవడం కోసం ఐక్య ఉద్యమాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఆ పరిణామ క్రమంలోనే నేడు విశాఖ ఉక్కు రక్షణ కోసం కేంద్ర నిర్ణయాలపై ప్రతిఘటనన్ను మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ మాజీ డైరెక్టర్ (ఆపరేషన్స్) కె కె రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాకు సంపద సృష్టిస్తున్న విశాఖ ఉక్కు పై కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమ అభివృద్ధి పరచడం కోసం కేంద్రం ఆర్థిక సాయం తో పాటు సకాలంలో అనుమతులను ఇవ్వాలని ఆయన అన్నారు.
స్టీల్ ప్లాంట్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( వర్క్స్) కె విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరితో పరిశ్రమ మనుగడకు కలుగుతున్న అవరోధాలు తగ్గించడం కోసం సరైన ఆలోచనలను ప్రభుత్వం దృష్టికి సరైన సమయంలో తీసుకువెళ్లాలని ఆయన వివరించారు. తద్వారా ఈ పరిశ్రమ అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు వత్తాసు పలకడం వల్ల ఏర్పడుతున్న ఈ అవరోధాలను అధిగమించటం ఐక్య ఉద్యమాలతో సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే రైతుల సంఘటిత ఉద్యమం అని ఆయన వివరించారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన 5 వేల కోట్లను ఈ ఒక్క సంవత్సరం జిఎస్టి ద్వారా తిరిగి చెల్లించిన ఘనత ఒక విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎల్ఐసి ఆస్తులు 39 లక్షల కోట్లు ఉన్నాయని, విశాఖ ఉక్కు ఆస్తుల విలువ 5-6 లక్షల కోట్లు ఉంటుందని ఇంతటి విలువైన ఆస్తులను దేశం సంపాదించుకోవడానికి దశాబ్దాల సమయం పట్టిందని ఆయన అన్నారు. వీటిని కారుచౌకగా తన తాబేదార్లు కట్టబెట్టే హక్కు ప్రభుత్వాలకు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కనుక వీటిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యంగా భావించాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సెమినార్ లో పాల్గొన వలసిన స్టీల్ ప్లాంట్ మాజీ సీఎం డి శివ సాగర్ రావు తన సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తెలియజేశారు. ఈ సెమినార్ కు గుర్తింపు యూనియన్ అధ్యక్షులు జె అయోధ్య రామ్ అధ్యక్షత వహించారు. దీనిలో గుర్తు యూనియన్ ప్రధాన కార్యదర్శి వైటి దాస్ సెమినార్ ప్రాధాన్యతతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని సెమినార్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిలో గుర్తింపు యూనియన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బి గంగారావు, సీనియర్ నాయకులు ఎన్. రామారావు భాగస్వామ్యులు పాడి త్రినాథ్, గణపతి రెడ్డి, బొడ్డు పైడిరాజు, డి వి రమణ రెడ్డి, టి జగదీష్, డి.సురేష్ బాబు తదితరులతోపాటు స్టీల్ సి ఐ టి యు కార్యదర్శివర్గ సభ్యులు, మహిళలు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో సంఘటిత అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు.
Comentários