పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ కోదండరాముడు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమ తాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comentarios