ఒంటిపూట బడులు నిర్వహించాలి : పి.డి.ఎస్.యు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
పాఠశాలలకు తక్షణమే ఒంటి పూట బడులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పి.డి.ఎస్.యు మండల నాయకులు సుదర్శన్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కార్యాలయంలో బుధవారం సుదర్శన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎండలకు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఏటా మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించే వారని.. ఏప్రిల్ మాసం ఆరంభమవుతున్నా ఈ ఏడాది ఒంటిపూట బడులు ప్రారంభించకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో ఫ్యాన్లు సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ప్రజా ప్రతినిధులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతుండడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి వెంటనే ఒంటిపూట బడులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు పట్టణ కమిటీ సభ్యులు అజయ్, ప్రేమేష్, హరిశ్చంద్ర, అగ్ని, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Comments