ఎంఎస్ సైకిల్ యాత్రకు జీవి సంఘీభావం
సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ప్రవీణ్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్.యస్ రాజు అనంతపురం నుండి అమరావతి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ లోని వాసవి సర్కిల్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజు చేపట్టిన సైకిల్ యాత్రకు సంఘీభావంగా ఆయనకు ఘనస్వాగతం పలికి వాసవి సర్కిల్ నుండి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్, గాంధీ రోడ్డు మీదుగా టీవీ రోడ్ లోని టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజు మాట్లాడుతూ, బాబుకు తోడుగా మేము సైతం ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టామని, బాబు పై బనాయించిన కేసులను నిరసిస్తూ ఐదు రోజుల క్రితం అనంతపురం నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర మొదలవగా, అడుగడుగునా తన సైకిల్ యాత్రకు టిడిపి నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రాజు చేపట్టిన సైకిల్ యాత్రకు తాను సంఘీభావం తెలుపుతున్నానని, పులివెందులలో చంద్రబాబు బహిరంగ సభ ఆదరణ ఓర్వలేకనే బాబుపై అక్రమ కేసులు బనాయించి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అరెస్టు చేశారని ఆయన అన్నారు. బాబు అరెస్టు పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువైతున్న నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో టిడిపి అధికారాన్ని చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, టిడిపి నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి భాస్కర్ రెడ్డి, ప్రొద్దుటూరు మహిళా అధ్యక్షురాలు భోగ లక్ష్మీదేవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, ఆవుల దస్తగిరి, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సైకిల్, బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
Comentarios