top of page
Writer's picturePRASANNA ANDHRA

కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై పరిష్కార దిశగా దృష్టి సారించాలి - ఎమ్మెల్యే వరద

మున్సిపల్ స్థలాలలో అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించండి


కౌన్సిల్ లో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టండి

వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


మున్సిపల్ స్థలాలలో అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని ఆక్రమణదారులు ఎలాంటి వారైనా ఉపేక్షించవద్దని, కౌన్సిల్లో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై పరిష్కారం దిశగా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ భీమునిపల్లె లక్ష్మిదేవి నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో కౌన్సిల్ సభ్యులు సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కౌన్సిల్ సభ్యుని సమస్యలపై పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు మరొక సమావేశంలో అదే సమస్యలను లేవనెత్తే పరిస్థితి రాకూడదని ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ సమస్యలపై ప్రత్యక్షంగా దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ముందుగా 11 అంశాలతో అధికారులు పొందుపరిచిన అజెండాలో పది అంశాలను కౌన్సిల్ ఆమోదం పొందగా ఒక అంశాన్ని మాత్రం రద్దు చేశారు. ఈ సమావేశంలో పలువురు సభ్యులు వారి వార్డులలోని సమస్యలను కౌన్సిల్ ముందుకు తీసుకు వచ్చారు. 3వ వార్డు కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్షుమ్మ తమ వార్డులోని మెడినోవా సమీపంలోని మడూరు కాల్వలో చెత్తను సక్రమంగా తొలగించ లేదన్నారు. స్పందించిన కమిషనర్ పూర్తిగా తొలగించారని వివరించారు.

33 వ వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి తమ వార్డులో కుక్కల బెడద అధికంగా ఉందని, ఎస్.వి.వి. బాయ్స్ హైస్కూల్ దగ్గర మున్సిపల్ స్థలాన్ని ప్రవేట్ వ్యక్తులు ఆక్రమించే యత్నం చేస్తున్నారని వార్డులో విద్యుత్తు పోల్స్ పై బ్యానర్లు తొలగించాలని కౌన్సిల్ దృష్టికి తేగా కమిషనర్ స్పందిస్తూ కుక్కల బెడద నివారణకు కృషి చేస్తామని, ఎస్.వి.వి. స్కూల్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించి తగు రక్షణ గోడ ఏర్పాటు చేస్తామని, విద్యుత్తు పోల్స్ పై బ్యానర్లను కట్టకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాష తమ వార్డులో అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై చర్యలు తీసుకోవాలని కోరగా, మున్సిపల్ కమిషనర్ నవంబర్ 4 వ తేదీ జాయింట్ సర్వే చేయిస్తామని తెలపగా, కౌన్సిలర్ సంతృప్తి చెందక పోవడంతో ఛైర్ పర్సన్ భీమునిపల్లె లక్ష్మిదేవి నాగరాజు కల్పించుకొని జాయింట్ సర్వే వరకు పనులు నిలిపివేసి, పూర్తి చేసి ప్రభుత్వ స్థలం ఐతే చర్యలు తీసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగరాజు త్వరలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ మల్లికార్జున పట్టణంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గతంలో 18 భవనాల విషయమై న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా వాటికి దాదాపు 3.18 కోట్ల రూపాయల ఫెనాల్టీ విధించారని, మరో 20 బిల్డింగ్ లకు కూడా మరో 3 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం వుందని తెలిపారు.


వైస్ ఛైర్మన్ ఖాజామోహిద్దీన్ మున్సిపల్ పార్క్ లో వాటర్ ఫౌంటెన్ ఎందుకు వినియోగంలో లేదని ప్రశ్నించగా అధికారులు స్పందిస్తూ అక్కడ నైట్ వాచ్మెన్ లేక పోవడం వలన ఫౌంటెన్ లోని వస్తువులు అపహరణకు గురయ్యాయని, త్వరలోనే వినియోగం లోకి తెస్తామని వివరించారు. ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నైట్ వాచ్మెన్ ను కానీ, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గాని పార్కులో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 17వ వార్డులో అక్రమ నిర్మాణాలపై చింతకుంట సరిత మరోసారి కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తూ, తమకు తెలియకుండానే సర్వే ఎలా చేయించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వరద ఆదేశాల మేరకు ఏసిపి నాగరాజు మాట్లాడుతూ ఆ వార్డులో సర్వే చేసే ముందుగా సభ్యులకు సమాచారం ఇస్తామని తెలిపారు. మరో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డి ఎగ్జిబిషన్ గుత్తేదారులు గెజిట్ పాటించడం లేదని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కమిషనర్ అధిక ధరలకు విక్రయాల పై విచారణ చేయిస్తున్నామన్నారు. అదే విధంగా మున్సిపాలిటికి మొత్తం డబ్బు చెల్లించారా అని వైస్ ఛైర్మన్ పాతకోట బంగారు రెడ్డి అడుగగా కమిషనర్ 1.50 కోట్ల రూపాయలు చెల్లించారాని, మిగిలిన మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, గతంలో కూడా పలువురు జీఎస్టీ బకాయి పడ్డారని వారి నుండి కూడా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేస్తామని వివరించారు. కౌన్సిలర్ కమాల్ బాష మాట్లాడుతూ కేవలం ఒక ఎగ్జిబిషన్ విషయమే కాకుండా మున్సిపల్ అధికారులు అన్ని విషయాలలో గెజిట్ పాటించి తీరాలని స్పష్టం చేశారు.


32 వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో వీధిలైట్లు వెలగడం లేదని సభ దృష్టికి తెచ్చారు స్పందించిన కమిషనర్ ఈరోజే వీధిలైట్ వచ్చాయని త్వరితగతిన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page