అక్రమ కట్టడాలపై చర్యల్లో ఎందుకా ఉదాసీనత.
- 13వ వార్డు పరిధిలోని శ్రీరాముల పేట టర్నింగ్‌లో వ్యాపార సముదాయం విషయంపై అధికారుల తీరును ప్రశ్నించిన ఆ వార్డు కౌన్సిలర్ ఎస్.ఇర్ఫాన్ బాష
ప్రొద్దుటూరు మున్సిపాల్టీ 13 వార్డు పరిధిలోని శివాలయం వీధి నుంచి శ్రీరాముల పేటకు తిరిగే మలుపులోని ఓ వ్యాపార దుకాణం మున్సిపాల్టీ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం చేపట్టడమే కాక, మున్సిపల్ స్థలంలోకి ఆక్రమణలకు జరిపి, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు, సంబంధిత సచివాలయ టౌన్ ప్లానింగ్ సెక్రటరీకి తెలియజేసినా ఎందుకు రెండు నెలల రోజులుగా చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని 13వ వార్డు కౌన్సిలర్ ఎస్.ఇర్ఫాన్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తన వార్డులోని సమస్యల పరిష్కారం కోరుతూ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాష కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. గత నెల 6న ఈ ఆక్రమణ విషయమై స్వయంగా వెళ్ళి పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆయన అధికారులను నిలదీశారు. ఆ నిర్మాణం వల్ల మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురికావడమే కాక, అటు వైపు వెళ్లే వాహనాలకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపినా పట్టించుకోకపోవడం ఏమిటని ఆయన సభలో ప్రశ్నించారు. దాదాపు 300ల అడుగుల మేర ఆక్రమణ జరుగుతోందని విన్నవించినా ఇప్పటి దాకా చర్యలు తీసుకోకపోగా, ఆ నిర్మాణాలకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారని అడిగారు.
సామాజిక బాధ్యతగా, మున్సిపల్ ఆస్తులను రక్షించడంతో పాటు, ఇతరులకు అసౌకర్యంగా ఉన్న విషయాన్ని కౌన్సిలర్ గా అధికారులకు తెలియజేస్తూ స్వయంగా తన లెటర్ హెడ్‌పై ఆగస్టు 22న ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంపై కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వ్యాపాద సముదాయినికి ఇచ్చిన అనుమతుల పత్రంలో కూడా కొట్టివేతలు, దిద్దివేతలు ఉండటంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ఇర్ఫాన్ బాష శివాలయం వీధిలోని ఆక్రమ నిర్మాణంపై కౌన్సిల్‌లో లేవనెత్తడంతో మున్సిపల్ కమీషనర్ వెంకటరమణ స్పందించారు. ఈ ఆక్రమణ సమస్యను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments