top of page
Writer's picturePRASANNA ANDHRA

మండపేటలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కృష్ణ భగవాన్ - ముప్పాళ్ళ సుబ్బారావు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సిఐ వేధింపులకు యువకుడు ఆత్మహత్యకు సంబంధించి సిబిఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు, భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. మండపేటలోని గాంధీ నగర్ లో మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసు వేధింపులే ఆత్మహత్య కు కారణమని స్పష్టం చేశారు. సిఐ ని నిర్దోషిగా చిత్రీకరిస్తూ కేసును తప్పుదోవ పట్టించేందుకే మీడియాపై బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. న్యాయం కోసం పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. మండపేట గాంధీనగర్ కి చెందిన యువకుడు ప్రగఢ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య కేసులో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తుందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐతో పాటు రామచంద్రాపురం డీఎస్పీ సైతం తప్పులు మీద తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు సందర్భాల్లో డిఎస్పీ చేసిన ప్రకటనలు భిన్నంగా ఉన్నాయన్నారు. మొదటిసారి ఒకలా మాట్లాడి రెండోసారి ఇంకోలా మాట్లాడారన్నారు. డిఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసు నమోదు చేయని కారణంగానే వీఆర్ లోకి పంపించినట్లు చెప్పడం జరిగిందన్నారు. కేసు నమోదు చేయని పరిస్థితుల్లో ఫోక్సో సెక్షన్ 21కింద మరియు సెక్షన్ 166 ఏ. ఐపిసి క్రింద సీఐపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అదే విధంగా ఫోక్సో చట్టం కింద బాధితులు పిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయనందుకు సెక్షన్ 166 ఏ కింద సీఐ పై మరో కేసు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. అసలు పిర్యాదును జీడీ ఎంట్రీలో ఎందుకు నమోదు చేయలేదో కారణం చెప్పాలన్నారు. వీఆర్ లోకి పంపించడం ఒక్కటే సరిపోదని, జరిగిన చట్ట ఉల్లంఘనలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇవేమీ చేయకుండా మీడియా ముందు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని డీస్పీని ప్రశ్నించారు. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా పోలీసులను కాపాడుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అసలు కేసు నమోదు చేయకుండా భగవాన్ ను స్టేషన్ కి ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. భగవాన్ రాకపోతే కుటుంబ సభ్యులను లోపల వేస్తామని హెచ్గరించే హక్కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయకుండా స్టేషన్ కు పిలవడం ఒక తప్పు అయితే రాత్రి ఎనిమిది గంటల వరకూ నిర్బంధించడం మరో తప్పిదమని పేర్కొన్నారు. ఇది అక్రమ నిర్బంధం అవునో కాదో డీఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అసలు యువకుడిపై దెబ్బలు లేవని నిర్ధారించడానికి డీఎస్పీ ఎవరని మండి పడ్డారు. దెబ్బలు ఉన్నాయో లేవో తేల్చాల్సింది పోస్ట్ మార్టం రిపోర్ట్ అని, అటువంటిది గాయాలు లేవని వెనకేసుకు రావడం సీఐ చేసిన దుశ్చర్యను సమర్ధించడం అవుతుందో లేదో చెప్పాలన్నారు. ఒక నేరస్థుడిని ప్రోత్సహించడం కూడా నేరమేనన్న సంగతి డీఎస్పీ గుర్తించుకోవాలన్నారు. సీఐ ను రక్షించేందుకు డీఎస్పీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఈ కేసును సీబీఐ చేత విచారణ సాగిస్తేనే దోషులకు శిక్ష పడుతుందన్నారు. పోలీసులతో విచారణ జరిపితే నేరస్తులకు శిక్షలు పడవని పేర్కొన్నారు. అదే విధంగా పోస్టుమార్టం విషయంలోనూ పొరపాట్లు చశారని ఆరోపించారు. ఇది కస్టోడియల్ మృతిగా భావిస్తున్న నేపథ్యంలో ఒకే డాక్టర్ కాకుండా డాక్టర్ల బృందం ఉమ్మడిగా పోస్టుమార్టం సాగించాల్సి ఉందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. పోలీసులు చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటనను వార్తగా రాసిన జర్నలిస్టులకు నోటీసులు జారీ చేయడం పైనా ఆయన మండిపడ్డారు. సమాజంలో జరిగే ప్రతీది రాసే హక్కు మీడియాకు ఉందన్నారు. ఎవరేం ఆరోపించినా ప్రజలకు తెలియజేసే పత్రికా స్వేచ్చ జర్నలిస్టులకు ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారాలపై మానవహక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.  ఈయన వెంట ఎం ఆర్ పి ఎస్ నాయకులు దూళి జయరాజు, ఆలమూరు బార్ అసోసియేషన్ కార్యదర్శి సాయి, గాలింకి నాగేశ్వరరావు, ఆంధ్ర ప్రదేశ్ నాట్య మండలి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు వేమగిరి శ్యామ్, మహంతి లక్ష్మణరావు, నారాయణ,గాలంకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

10 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page