నా ఆస్తుల విలువ 150 కోట్లు - ఎమ్మెల్యే రాచమల్లు స్పష్ణీకరణ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గడచిన కొంతకాలంగా ప్రొద్దుటూరు టిడిపి నాయకులు తాను వేల కోట్ల అవినీతి అక్రమ సంపాదనకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారని, ఇందులో ఏ మాత్రం సత్యం లేదని, తాను తన కుటుంబ సభ్యుల ఆస్తి విలువ 150 కోట్ల రూపాయల మేర ఉన్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పత్రికా ముఖంగా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గడచిన కొద్ది కాలంగా టిడిపి నాయకులు ఎమ్మెల్యే రాచమల్లు పై కోట్లు కొల్లగొట్టారని చేస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం వైసీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తమ నాయకుడు ఎమ్మెల్యే రాచమల్లు ఆస్తులు 150 కోట్ల రూపాయల మేర కలవని, టిడిపి నాయకులు 2500 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్ధించినట్లు ఆరోపణలు చేయటం అసత్యము అని తమ ఎమ్మెల్యే ఆస్తులను టిడిపి నాయకులు ఎవరైనా లేదా మూకుమ్మడిగా 150 కోట్లు చెల్లించి ఎమ్మెల్యే రాచమల్లు ఆయన కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఆస్తులను కొనుగోలు చేయవచ్చని, లేని పక్షంలో చేసిన అవినీతి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, చెల్లించే నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డులోని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి చేరుకొని అక్కడ డబ్బులు చెల్లించి ఆస్తులు తమ పేరున బదిలీ చేసుకోవచ్చని వారు వెల్లడించగా, గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే రాచమల్లు ఆయన సతీమణి రమాదేవి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే దాదాపు గంటకు పైగా టిడిపి నాయకుల కోసం వేచి చూశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాల వైసిపి పాలనలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఇది గిట్టని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనపై వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను గుప్పిస్తూ ప్రజలలో తనను అవినీతిపరుడుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారని అన్నారు. తన పేరిట తన కుటుంబం పేరిట ఉన్న ఆస్తులపై కుటుంబ సభ్యులు అందరం ఏకతాటిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు, టిడిపి నాయకులు తన ఆస్తులను కొనుగోలు చేయడానికి సిద్ధమైతే తాను ఈ క్షణమే వారికి ఆస్తులు బదలాయింపు చేస్తానని, ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధిగా మాట ఇస్తున్నానని అన్నారు. తాను ఆర్జించిన ప్రతి రూపాయి వ్యాపార లావాదేవీల ద్వారానే వచ్చినట్లు, ఒకానొక సందర్భంలో భావోద్వేకానికి గురవుతూ ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments