తండ్రి ఆశయ సాధన కోసమే షర్మిల కాంగ్రెస్ గూటికి - ఇంచార్జ్ నజీర్ అహ్మద్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను, ఆరోపణలను ఖండిస్తున్నట్లు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూల నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో అప్పటి రాజకీయ పరిణామాలను అంగీకరిస్తున్నామని, నాటి విభజనకు కట్టుబడి ఉన్నామని, అయితే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుండి విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని వైసిపి ప్రశ్నించిన దాఖలాలు లేవని అన్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్ర పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారని, గత ఎన్నికలలో కర్ణాటక అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయటం ఇందుకు సంకేతం అని అభిప్రాయపడ్డారు. మోడీ దగ్గర మెడలు వంచిన జగన్ సర్కార్ ఇప్పటికైనా మేలుకోవాలని, పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని నజీర్ హితువు పలికారు. నాడు 16 నెలలు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో, తాను జగనన్న సంధించిన బాణాన్ని అంటూ వైఎస్ షర్మిల ప్రజలలోకి వచ్చిందని ఆ సందర్భం ఎమ్మెల్యేకి గుర్తులేదా అంటూ ప్రశ్నించారు? దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ అని, అధిష్టానం లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం ఉండేదని, అలాంటి పూర్వవైభవాన్ని తిరిగి రాష్ట్రంలో తీసుకురావటానికి తండ్రి మార్గంలో షర్మిల పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే నేడు ఆ పార్టీని విమర్శించటం హాస్యాస్పదమని, తండ్రి ఆశయ సాధన కోసమే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు, రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి పతనం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నట్లు, త్వరలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments