లోకేష్ పాదయాత్రపై అనంతపురం డీఐజీ కీలక ప్రకటన..!
ఏపీలో యువగళం పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు చిత్తూరు జిల్లాలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా మొన్న పలమనేరులో లోకేష్ వాహనం సీజ్, నిన్న బంగారుపాళ్యంలో బహిరంగసభకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై పోలీసులు ఇవాళ స్పందించారు.
లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇవాళ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. లోకేష్ పాదయాత్ర అడ్డుకునే ఉద్దేశం పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ లేదన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు లోకేష్ యాత్రలో అడ్డంకులు కల్పిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నట్లు రవిప్రకాష్ వెల్లడించారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో నిబంధనల ఉల్లంఘన ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతే కానీ ఇతరత్రా ఇబ్బందులేవీ కలిగించడం లేదన్నారు. పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. పాదయాత్రలు చేసేటప్పుడు నేతల స్ధాయి మేరకు భద్రత కల్పిస్తామని రవిప్రకాష్ మరో క్లారిటీ కూడా ఇచ్చారు.
Comentários