ఆడపిల్లల ఎదుగుదలతోనే సమాజం చైతన్యం. ఇది మన అందరి బాధ్యత.
---ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి.
ఆడపిల్లలను ఉన్నతంగా చదివించి స్వేచ్ఛగా ఎదగనిచ్చినప్పుడే వారు అద్భుతాలు సాధిస్తారని, సమాజం చైతన్యవంతం అవుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రాజేశ్వరి పేర్కొన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవం లో భాగంగా ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. విద్యా, ఉద్యోగం,ఆరోగ్యం వంటి విషయాలలో బాలురకు సమానంగా బాలికలను ప్రోత్సహించినప్పుడే సంపూర్ణ ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు.
ప్రభుత్వం కల్పించిన సమాన హక్కులపై ప్రతి బాలిక అవగాహన కలిగి ఉండాలని అది విద్యను అభ్యసించినప్పుడే సాధ్యమన్నారు. భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, లింగ వివక్ష, బాలికలపై హింస , వరకట్న నిషేధం తదితర అంశాలను నిరోధించే దానికి మన ప్రభుత్వం కటినమైన చట్టాలను రూపొందించిందన్నారు.1098 కి ఫోన్ చేయడం ద్వారా ప్రతి బాలిక పూర్తి రక్షణ పొందవచ్చని సిడిపిఓ రాజేశ్వరి తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారత మొదటి మహిళ ప్రధానిగా ప్రమాణం చేసిన జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం గా నిర్వహించడం 2008 నుంచి కొనసాగుతూ ఉందన్నారు. ఆడపిల్లలు చదువు,ఉద్యోగంతోనే సమాజంలో గౌరవింపబడతారని ప్రతి బాలిక ఉన్నత చదువులు అభ్యసించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపట్టిన "బేటి బచావో బేటి పడావో"ప్రతిజ్ఞను విద్యార్థులందరూ ముక్తకంఠంతో నినదించారు. తదుపరి హై స్కూల్ నుంచి కొత్త బస్టాండ్ ప్రాంగణం వరకు విద్యార్థులచే నినాదాలు చేయిస్తూ ర్యాలీగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు వసుంధరమ్మ, విజయకుమారి, విశాలాక్షి, గ్రేడ్ టు సూపర్వైజర్ సురేఖ రాణి, హై స్కూల్ అధ్యాపక సిబ్బంది, అంగన్వాడి వర్కర్లు మరియు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments