హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి - జాతీయవాద రచయితల సంఘం
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
తమిళనాడు యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిది స్టాలిన్ తాజాగా సనాతన ధర్మాన్ని వైరల్ వ్యాధితో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని, సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ పిలుపునివ్వటం కోట్లాదిమంది హిందూ ప్రజల మనోభావాలను అవమానపరచడమేనని తాము భావిస్తున్నట్లు జాతీయవాద రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భవాని శంకర్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సనాతన ధర్మం సృష్టితోనే ప్రారంభమైనదని, ఇది ఏ ఒక్క వ్యక్తి చేత ప్రతిపాదించిన మతం కాదని, సనాతన ధర్మం జీవన విధానాన్ని తెలుపుతుందని, గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిందని గుర్తు చేశారు. స్టాలిన్ మాటలు భారతదేశాన్ని, జాతీయ గౌరవాన్ని అవహేళన చేయడమేనని, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ మాటలు అన్నట్లు తాము భావిస్తున్నామని, భారతదేశం విజ్ఞానాల సంపదలతో విరాజిల్లుతోందని, గతంలో ద్వేషం కక్కిన నాస్తికులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని, కేవలం మైనారిటీల ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి పొందటానికి స్టాలిన్ ఇలాంటి మాటలు మాట్లాడారని, ఇది హేయమైన చర్యగా తాము భావిస్తున్నట్లు, స్టాలిన్ వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ వై. రమేష్ బాబు పాల్గొన్నారు.
Comments