నీలాపురం జగనన్న కాలనీలో - ఎమ్మెల్యే భూమిపూజ
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
శనివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని, కొత్తపల్లి పంచాయతీ, నీలాపురం గ్రామం నందు పేదలకు కేటాయించిన జగనన్న కాలనీ నందు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గతంలో శ్రీ కందుల బాలనాగిరెడ్డి కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీ పేరున ఉన్న ఫ్లాట్లలోని ప్లాట్ నెంబర్ 81 నుండి 113 వరకు వాజ్పేయి నగర్ వాసులు ఆక్రమించి ఇల్లు నిర్మించుకోగా, 2022 వ సంవత్సరంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమితదారుల నుండి ప్లాట్లను యజమానులకు అప్పగించాలని హైకోర్ట్ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, ఆర్డిఓ, ఎమ్మార్వో, ప్రభుత్వ అధికారులు వాజ్పేయి నగర వాసులను ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. ప్రతిపక్షాలు, పలు ప్రజా సంఘాలు, ఆక్రమితదారులు నాడు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లుపై ఆరోపణలు గుప్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా శనివారం నీలాపురంలోని జగనన్న కాలనీలో హిజ్రాలకు కేటాయించిన 30 ఫ్లాట్లలో, అలాగే వాజ్పేయి నగర్ నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఎమ్మెల్యే రాచమల్లు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, తనపై వాజ్పేయి నగర వాసులు, టిడిపి నాయకులు, పలు ప్రజా సంఘాలు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ వాజ్పేయి నగర్ ప్రజల దృష్టిలో తనను బలహీనవర్గాల ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు పేద ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించానని, పేదల పక్షపాతిగా నిలిచి నియోజకవర్గస్థాయిలో పలు సేవా కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, పేదల పక్షపాతిగా తాను పేరు తెచ్చుకున్నానని, ఏనాడు పేదలను బడుగు బలహీన వర్గాలను కించపరచలేదని వారిని గౌరవించి సముచిత స్థానంలో నిలబెట్టాలన్నదే తన ఆశయంగా పేర్కొంటూ, తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. శనివారం మధ్యాహ్నం నీలాపురం జగనన్న కాలనీలో వారికి కేటాయించిన ఇండ్ల స్థలాలలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, గుడిసెల్లో నివసించే పేద ప్రజలు నేడు పక్కా గృహాలలోకి మారి విద్యుత్, మంచినీటి సౌకర్యాలతో పూర్తిగా అభివృద్ధి చెందిన జగనన్న కాలనీలోకి మారుతున్నందుకు సంతోషిస్తున్నానని, రాబోవు రోజుల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగశేషారెడ్డి, కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, పిట్టా బాలాజీ, వంశీధర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాజ్పేయి నగర్ వాసులు పాల్గొన్నారు.
Comments